ఈ దొంగ బాబా ఆగ‌డాలు మాములుగా లేవుగా… ఏకంగా 40 కోట్లు వ‌సూలా?

దొంగ‌త‌నాలు, మోసాలు చేసేవారు ఇటీవ‌ల ఎక్కువ‌యిపోయారు. అందులోనూ ముఖ్యంగా మోసాలు చేసేవారు ఎక్కువ‌గా ఆడ‌వాళ్ళ‌నే టార్గెట్ చేసుకుంటారు. చాలా మందికి పూజ‌లు, దైవ‌భ‌క్తి బాబాల‌ను ఎక్కువ‌గా న‌మ్ముతుంటారు ఆడ‌వారు. అలాగే అదేవిధంగా మోస‌పోతుంటారు. ఇటీవ‌లె హైద‌రాబాద్ పోలీసులు ఓ దొంగ బాబా ఆట‌క‌ట్టించారు. ఆధ్యాత్మిక బోధనల పేరుతో అమ్మాయిలకు దగ్గరవడం.. ఆ తరువాత తన వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక వడ్డీలు వస్తాయని చెప్పి మాయచేసి డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నకేటుగాడిని ఎస్‌ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. దొంగబాబా మాటలు నమ్మి మోసపోయిన ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన గిరీష్ సింగ్ హైదరాబాద్ వచ్చి దొంగబాబా అవతారమెత్తాడు. ఈ బాబా ముసుగులో ఆయ‌న చేసే ప‌నులు అంతా ఇంతా కాదు. అద్వైత స్పిరిచువల్ రీఛార్జ్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ పేరుతో ఆధ్యాత్మిక సంస్థను స్థాపించాడు. సంస్థ ద్వారా అమాయకులకు మాయమాటలు చెప్పి వారి ద్వారా పెట్టుబడులు పెట్టించి నిండా ముంచేశాడు. చదివింది డిగ్రీనే అయినా ఆధ్యాత్మిక బోధనల పేరుతో అమ్మాయిలను బురిడీ కొట్టించి అయిన కాడికి దోచుకునేవాడు.

ముఖ్యంగా త‌న టార్గెట్ అంతా మహిళల పైనే పెట్టాడు. వివిధ రకాల ప్రక్రియలు, స్కీమ్‌ల పేరుతో మహిళలను నేరుగా సంప్రదించి ఆధ్యాత్మిక బోధనల పేరతో దగ్గరయ్యేవాడు. మహిళలు తనను నమ్మారని గ్రహించిన తరువాత తనకు వ్యాపారాలు ఉన్నాయని.. కొంత మొత్తం తన దగ్గర పెట్టుబడి పెడితే మీ కుటుంబంలో సిరి సంపదలు కలుగుతాయని.. అధిక లాభాలు కూడా వస్తాయని ఆశచూపించేవాడు.

ఇలా ఇప్పటికే ఏకంగా రూ.40 కోట్ల వరకు వసూలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. దొంగబాబా మాటలకు మోసపోయి డ‌బ్బులు క‌ట్టిన బాధిదులు చాలా మందే ఉన్నారు. వారు మోస‌పోయామ‌న్న విష‌యం చాలా రోజుల‌కి తెలుసుకుని పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి అనంత‌రం దొంగ‌బాబాను అరెస్ట్ చేసి ద‌ర్యాప్తు కొన‌సాగించారు. గిరీష్ సింగ్‌పై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదైనట్లు తెలుస్తోంది. ఇలా బాబాల‌ను న‌మ్మేవారు ఉన్నంత కాలం ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉంటాయి. బాబాల ఆగ‌డాలకు ఎక్క‌డా బ్రేక్ ప‌డ‌దు. మ‌హిళ‌లు ఇలాంటి ఇష‌యాల్లో కాస్త జాగ్ర‌త్త వ‌హించ‌డం చాలా మంచిది. ఇలాంటి వాటి వ‌ల్ల‌ కొన్ని సార్లు డ‌బ్బులు మాత్ర‌మే కాక ప్రాణాలు కూడా కోల్పోయే ప్ర‌మాదం ఉంటుంది.