లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం నూతన పెన్షన్ పథకాన్ని ప్రకటించింది. ‘ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్’ పథకం కింద అసంఘటిత రంగంలోని కార్మికులకు 60 ఏళ్లు దాటాక నెలనెలా పెన్షన్ ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇందుకోసం కార్మికులు ప్రతీ నెల కనీస మొత్తం కడితే సరిపోతుందన్నారు. నెలకు రూ.15,000 అంతకంటే తక్కువ వేతనం పొందే కార్మికులు ఇందుకు అర్హులని తెలిపారు.
వీరంతా 60 ఏళ్లు చేరుకున్నాక నెలకు రూ.3,000 పెన్షన్ అందుకుంటారని వ్యాఖ్యానించారు. ఒకవేళ 29 ఏళ్ల వయసులోని వ్యక్తి ఈ పథకంలో చేరితే నెలకు రూ.100 కడితే సరిపోతుందన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందనీ, ఇందుకోసం ఇప్పటికే రూ.500 కోట్లు మంజూరు చేశామన్నారు. ఈ పథకంతో దాదాపు 10 కోట్ల మంది కార్మికులు, సిబ్బంది లబ్ధి పొందుతారని చెప్పారు.