రిపేర్లు చేసి రీరిలీజ్, వర్కవుట్ అవుతుందా?

ఒక సారి మార్కెట్ లో కి వెళ్లిపోయి టాక్ తెచ్చుకున్న తర్వాత అది హిట్…ఫట్ అయినా చేయగలిగిందేమి ఉండదు. హిట్ అయితే పండగ చేసుకోవటం..ఫ్లాఫ్ అయితే నిర్మాత నెత్తిన చెంగేసుకోవటం రొటీన్ గా జరిగే కార్యక్రమాలు. అయితే ఆశ అనేది ఎవరినీ విడిచిపెట్టదు. ఏమో కాస్త రిపేర్లు చేసి వదిలితే ఆడుతుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు ప్రియా ప్రకాష్ వారియర్ సినిమాకు అదే జరుగుతోంది.

మలయాళ బ్యూటీ, వింక్ సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన మొదటి చిత్రం ‘ఒరు ఆధార్ లవ్’. ప్రేమికుల రోజున విడుదలైన ఈ చిత్రం పూర్ రివ్యూస్ ను రాబట్టుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్ బాగాలేదని టాక్ రావడంతో తాజాగా ఈ చిత్ర క్లైమాక్స్ ను మార్చారు. ఈరోజునుండి ఈ చిత్రం యొక్క న్యూ వెర్షన్ థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. ఒమర్ లులు తెరకెక్కించిన ఈచిత్రానికి షాన్ రెహమాన్ సంగీతం అందించాడు.

ప్రియా ప్రకాశ్‌ ద్వారా సినిమాకు ఎంతో పాపులారిటీ వచ్చింది కానీ సినిమా మాత్రం బాక్సాఫీస్‌ వద్ద డీలాపడిపోయింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని క్లైమాక్స్‌ భాగం ప్రేక్షకులను నిరాశకు గురిచేసిందని రివ్యూలు వచ్చాయి. దాంతో కేవలం క్లైమాక్స్‌ సన్నివేశాన్ని మార్చాలని దర్శక,నిర్మాతలు నిర్ణయించారు.

డైరక్టర్ మాట్లాడుతూ…‘క్లైమాక్స్‌ సన్నివేశంలో మార్పులు చేసి మళ్లీ చిత్రీకరించాం. పది నిమిషాల పాటు ఈ సన్నివేశం ఉండబోతోంది. బుధవారం నుంచి కొత్త క్లైమాక్స్‌తో సినిమా ప్రదర్శితమవుతుంది. నేను తీసిన మూడో చిత్రమిది. నా మొదటి రెండు సినిమాలు కూడా రొమాంటిక్‌ కామెడీ నేపథ్యంలోనే ఉంటాయి.

దాంతో ‘ఒరు అడార్‌ లవ్’ సినిమాను రియలిస్టిక్‌గా తెరకెక్కించాలని అనుకున్నాను. అందుకే క్లైమాక్స్‌కు ట్రాజెడీనీ జోడించాను. కానీ ప్రేక్షకులు ఈ సన్నివేశంతో నిరాశకు గురయ్యారు. దాంతో ఆ సన్నివేశాన్ని మార్చాలని నేను, నిర్మాత నిర్ణయించుకుని కొత్తగా మళ్లీ తెరకెక్కించాం’ అని వెల్లడించారు.