హాలీవుడ్‌ని పక్కాగా తొక్కేసిన సాహో!
ఇది అసలు కథే లేని సినిమా.. చెత్త సినిమా.. స్క్రీన్ ప్లే గందరగోళం అంటూ తిట్టేశారు క్రిటిక్స్. ఈ దశాబ్ధ కాలంలో `సాహో`పై వచ్చినన్ని విమర్శలు బహుశా వేరొక సినిమాపై రాలేదనే చెప్పాలి. అయితే విమర్శకులు పొరబడ్డారా? లేక ఇవన్నీ చెత్త రివ్యూలు అనుకోవాలా? అనేంతగా ఈ వసూళ్లు చూస్తే షాక్ కి గురవ్వాల్సి వస్తోంది. సాహో చిత్రం తొలిరోజు రికార్డులు.. తొలి వీకెండ్ రికార్డుల్ని బ్రేక్ చేసింది. సైతిండియా టాప్ 3 సినిమాగా .. ఇండియాలో టాప్ 6 వసూళ్ల సినిమాగా రికార్డులకెక్కింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వసూళ్లు చాలా హాలీవుడ్ సినిమాలతో పోలిస్తే బెటర్ గా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సినిమా బాలేదని విమర్శించిన వారంతా నోరెళ్లబెట్టే లా అద్భుత వసూళ్లు సాధిస్తోంది.
ఓపెనింగ్ వీకెండ్ ఇప్పటికే ఈ సినిమా పలు హాలీవుడ్ బ్లాక్ బస్టర్ల తొలి వీకెండ్ రికార్డుల్ని బ్రేక్ చేసి ఆశ్చర్యపరిచింది. డిస్నీస్ `ది లయన్ కింగ్` -27 మిలియన్ డాలర్లు, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ -25 మిలియన్ డాలర్లు, యాంజెల్ హాజ్ ఫాలెన్ -24 మిలియన్ డాలర్లు తొలి మూడు రోజుల్లో వసూలు చేశాయి. వాటన్నిటి రికార్డుల్ని కొట్టేస్తూ ఆహో తొలి వీకెండ్ నాటికి 41 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అంటే భారతీయ కరెన్సీలో దాదాపు 294 కోట్ల మేర వసూలు చేసింది ఈ చిత్రం. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ : హాబ్స్ అండ్ షా చిత్రం దాదాపు 45 మిలియన్ డాలర్లతో టాప్ పొజిషన్ లో ఉంటే ఆ తర్వాతి స్థానంలో సాహో నిలిచింది. ఆ మేరకు ప్రముఖ క్రిటిక్ రమేష్ బాలా వివరాల్ని అందించారు.
సాహో రికార్డుల వేట ఎలా సాగింది? అన్నది విశ్లేషిస్తే… ఆగస్టు 30న రిలీజైన ఈ చిత్రం హిందీ వెర్షన్ తొలి వీకెండ్ నాటికి 93.28 కోట్లు వసూలు చేసింది. సోమవారం మరో 14.20కోట్ల వసూళ్లు సాధించింది. ఈ మొత్తం కలిపితే 107 కోట్లు సుమారు హిందీ బాక్సాఫీస్ నుంచి వసూలైంది. హిందీ బాక్సాఫీస్ వరకూ చూస్తే డే1-24.20కోట్లు, డే 2-25.20కోట్లు, డే3-29.48కోట్లు వసూలు చేసింది. ఓపెనింగ్ వీకెండ్ -79కోట్లు వసూలు చేసిది. డే4లో 14.20కోట్లు వసూలైంది.
దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన `సాహో` ప్రపంచవ్యాప్తంగా 10వేల స్క్రీన్లలో రిలీజైంది. కేవలం ఇండియాలో 4500 స్క్రీన్లలో రిలీజైంది. వరల్డ్ వైడ్ 294 కోట్లు పైగా వసూలు చేసింది. హిందీ బాక్సాఫీస్ నుంచి నాలుగు రోజులకు 107 కోట్లు.. ఇండియా వైడ్ బాక్సాఫీస్ నుంచి మూడు రోజుల్లో 219 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. నాలుగు రోజులు కలుపుకుని ఇంకెంత వసూలైందో తేలాల్సి ఉంది. ఒక తెలుగు సినిమా ఈ స్థాయి ప్రభంజనం సృష్టించడం అన్నది రియల్ వండర్ అనే చెప్పాలి. డార్లింగ్ ప్రభాస్ హాలీవుడ్ స్టార్లను కొట్టే రేంజు అని చెప్పడానికి ఇంతకంటే ఇంకేం కావాలి. అసలు రివ్యూల్ని పట్టించుకోకుండా హిందీ ప్రేక్షకులు థియేటర్లకు వెళుతున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ అభిమానులే చాలు. ఇకపోతే తమిళ బాక్సాఫీస్ మాత్రం తంబీలు భాషాభిమానం చూపించి దూరం పెట్టేశారని అనుకోవచ్చు.