వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎమ్‌పిహెచ్’. వరుణ్ తేజ్, అదితి రావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని … ఘాజీతో జాతీయ అవార్డ్ అందుకున్న సంకల్ప్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం ట్రైలర్,పాటలు అన్నీ కూడా సినిమా పై క్రేజ్ పెంచాయి. బిజినెస్ కూడా బాగా జరిగిందని వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం హిందీ వెర్షన్ ని సైతం అదే రోజున విడుదల చేస్తారని ప్రచారం జరిగింది.
ముఖ్యంగా ఘాజీ దర్శకుడు నుంచి వస్తున్న చిత్రం కావటం, హిందీలో పాపులారిటి ఉన్న దక్షిణాది దర్శకుడు క్రిష్ నిర్మాత కావటం అక్కడ బిజినెస్ కు,రిలీజ్ కు కలిసివస్తుందని భావించారు. అయితే ఇప్పుడు చిత్రం రిలీజ్ లేటవుతోంది. తెలుగు రిలీజ్ రోజే హిందీ వెర్షన్ రిలీజ్ పెట్టడం లేదు. అందుకు కారణం..డబ్బింగ్ పనులు పూర్తి కావటమే అని నిర్మాతలు చెప్తున్నారు. కానీ అది నిజం కాదని, పెద్ద ప్రొడక్షన్ కంపెనీలతో ఈ సినిమా రిలీజ్ గురించి మాట్లాడుతున్న మాటలు ఓ కొలిక్కి రాలేదని, దేశం మొత్తం భారీ ఎత్తున రిలీజ్ చేయాలంటే హిందీలోనూ కరణ్ జోహార్ స్దాయి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఉండాలని క్రిష్ భావించటమే కారణం అంటున్నారు.
చిత్రం విషయానికి స్తే.. జీరో గ్రావిటీలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్పేస్ సెటప్‌లో ఈ అంతరిక్షం సినిమాను చిత్రీకరించారు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఈ చిత్రం కోసం అత్యున్నత సాంకేతిక విభాగం పని చేశారు. హాలీవుడ్ యాక్షన్ నిపుణుల పర్యవేక్షణలో అంతరిక్షం చిత్రానికి అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించారు. విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రానికి ప్రధానాకర్షణగా నిలవనున్నాయి.
హీరో వరుణ్ తేజ్ తో పాటు పలువురు నటీనటులు కూడా ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్సుల కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. ‘అంతరిక్షం 9000 కెఎమ్‌పిహెచ్’ కోసం.. ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవడానికి చిత్ర యూనిట్ సిద్ధపడినట్లుగా సమాచారం. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, సాయిబాబు జాగర్లమూడి, వై రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
జ్ఞానశేఖర్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రశాంత్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రయోగాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ 21న ఈ చిత్రం విడుదల కానుంది.