ఏపీ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఊపులో చంద్రబాబుకు బయోపిక్ రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జీవితం, రాజకీయ చరిత్ర ఇతివృత్తంతో నిర్మిస్తున్న ‘చంద్రోదయం’ చిత్రాన్ని మార్చి 10న రాష్ట్రవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత జి.వి.కె.రాజేంద్ర తెలిపారు.
నిర్మాత మాట్లాడుతూ.. మోహన్ శ్రీజ సినిమాస్ శ్వేతార్క గణపతి ఎంటర్‌ప్రైజస్ పతాకంలో రూపొందిన ఈ చిత్రాన్ని 2016 ఆగస్టులో నారావారిపల్లెలో ప్రారంభించామన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై దాదాపు 45రోజుల పాటు నారావారిపల్లెలో షూటింగ్ నిర్వహించినట్లు తెలిపారు. కథ, మాటలు, దర్శకత్వం పసుపులేటి వెంకటరమణ వహించినట్లు వివరించారు.
దర్శకుడు పి.వెంకటరమణ మాట్లాడుతూ…చంద్రబాబు రాజకీయ చరిత్ర కథాంశంగా చంద్రోదయం-1ను మార్చి 10న విడుదల చేస్తామన్నారు. ఆయన జీవిత చరిత్ర కథాంశంగా చంద్రోదయం-2 ఉంటుందన్నారు. మొదటి భాగంలో.. 2014 నుంచి ఇప్పటి వరకు ఆయన పేదల కోసం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూపిస్తామన్నారు. కాగా, చంద్రబాబు నిజాయితీగా సమాజానికి చేస్తున్న సేవను ప్రజలకు తెలియజెప్పాలనే లక్ష్యంతోనే ఈ సినిమా తీస్తున్నామని వెంకటరమణ చెప్పారు.