“అవెంజ‌ర్స్ ఎండ్‌గేమ్‌” కలెక్షన్స్ …తెలుగు సినిమాలపైనా?

అవెంజ‌ర్స్ ఎండ్‌గేమ్ బాక్సాఫీసు వ‌ద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ వీకెండ్ హైదరాబాద్ లోని అన్ని ముఖ్యమైన మ‌ల్టీప్లెక్స్‌ల‌లో అవెంజర్స్ ప్రేక్షకులతోనే నిండిపోయాయి. థానోస్‌ను అంతం చేయాల‌న్న దీక్ష‌తో సూప‌ర్‌హీరోస్ అంతా ఒక్క‌టై ఈ విశ్వాన్ని ర‌క్షించటమే కథ జనాలకు తెగ నచ్చేస్తోంది. ఈ హడావిడి కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాలేదు. విజయవాడ వరంగల్, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, కర్నూలు…. ఇలా అన్ని నగరాల్లోనూ ఇదే పరిస్దితి ఉంది.

దాంతో దేశ వ్యాప్తంగా ఈ చిత్రం తొలి రోజు 51.25 కోట్ల వ‌సూళ్ళు చేసిన‌ట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రం ప్రభావం టాలీవుడ్ సినిమాల‌పై భారీ ఎత్తున చూపిస్తుంది. గురువారంవరకూ జెర్సీ, మ‌జిలీ, కాంచ‌న 3, చిత్రల‌హ‌రి చిత్రాలు మంచి టాక్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా న‌డుస్తుండ‌గా, అవెంజ‌ర్స్ సృష్టిస్తున్న తుఫానుకి తెలుగు చిత్రాల కలెక్ష‌న్స్ కాస్త త‌గ్గాయని తెలుస్తోంది. హైద‌రాబాద్‌లో మాత్రం జెర్సీ చిత్రం కలెక్షన్స్ డౌన్ కాలేదని, మంచి వ‌సూళ్ళ‌ని సాధిస్తోందని, వీకెండ్ లోనూ ఈ చిత్రం దుమ్ము దులుపుతోందని తెలుస్తోంది.

ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన ఆ సినిమా.. రెండు రోజుల్లోనే 2130 కోట్లు వ‌సూల్ చేసింది. సినిమా రిలీజైన తొలి రోజే 1186 కోట్లు వ‌సూల్ చేసిన‌ట్లు చెబుతున్నారు. కేవలం రెండు రోజుల్లోనే రెండు వేల కోట్లు వ‌సూల్ చేసిన‌ట్లు డెడ్‌లైన్ వెబ్‌సైట్‌ పేర్కొన్న‌ది.

మొత్తం 46 దేశాల్లో ఈ సినిమా రిలీజైంది. మ‌న దేశంలోనూ శుక్ర‌వారం ఈ సినిమా విడుద‌లైంది. అయితే చైనాలో ఈ సినిమా రెండు రోజుల ముందే రిలీజైంది. అక్క‌డ 1075 కోట్లు వ‌సూల్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆంథోనీ, జో రూసోలు ఈ సినిమాను డైర‌క్ట్ చేశారు. క్రిస్టోఫ‌ర్ మార్క‌స్‌, స్టీఫెన్ మాక్‌ఫీలేలు స్క్రిప్ట్ అందించారు.