`సాహో` బయ్యర్లకు నష్టాలు ఎంత?
ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టాలని అందుకు మరింత స్ట్రాంగ్ బేస్ ని బిల్డ్ చేయాలని అతని మిత్ర బృందం చేసిన ప్రయత్నం నూటికి నూరు శాతం విజయం సాధించలేకపోయింది. 70 శాతం విజయం మాత్రమేనని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. `బాహుబలి` లాంటి రికార్డ్ బ్రేకింగ్ బ్లాక్ బస్టర్ తరువాత ప్రభాస్ నటించిన `సాహో` కోసం ప్రభాస్ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని మేకర్స్ భారీ స్థాయిలో ఈ చిత్రానికి ఖర్చు చేశారు. ఆ రేంజులో చిత్రాన్ని మార్కెట్ కూడా చేసుకున్నారు. 290 కోట్లకు ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా బిజినెస్ జరిగింది. కానీ తొలి రెండు వారాలకు వసూలు చేసింది మాత్రం 213.42 కోట్లు (నెట్) అని ట్రేడ్ లెక్కలు తేల్చింది.
అంటే రెండో వారాంతానికి `సాహో` బయ్యర్లకు 73.59 శాతం పెట్టుబడిని మాత్రమే తిరిగి వెనక్కి వచ్చింది. రెండవ వారం వీకెండ్‌లో మరో 14. 17 కోట్లని రాబట్టింది. ఆ తరువాత రన్‌లో మరో 15 కోట్లు రాబట్టింది. దాంతో సాహో బయ్యర్లు 230 కోట్లు వసూలు చేసినట్లయింది. వంద శాతం వసూళ్లు పోను లాభాల్ని అందించాల్సిన భారీ చిత్రం పెట్టిన పెట్టుబడిలో 79.31 శాతం మాత్రమే రికవరీ చేయగలిగింది. ఈ లెక్కల్ని బేరీజు వేసి చూస్తే `సాహో`ని నమ్మి కోట్లు కుమ్మరించిన నిర్మాతలు దాదాపు 60 కోట్లు నష్టపోయినట్టుగా స్పష్టమవుతోంది. హిందీ వెర్షన్ మాత్రం నార్త్ ఇండియాలో బయ్యర్లకు మంచి లాభాల్నే అందించింది. రానున్న రోజుల్లో వారికి మరిన్ని లాభాలు తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తోంది.
ఏరియా వైజ్‌గా బయ్యర్లకు ఏ స్థాయిలో నష్టాలొచ్చాయంటే నైజాం 40 కోట్లకు కొంటె 28.79 కోట్లు మాత్రమే వెనక్కి వచ్చింది. సీడెడ్ 23.60 కోట్లకు కొంటే 11.84 కోట్లు వచ్చింది. వైజాగ్ 15 కోట్లకు కొంటే వచ్చింది 9.65 కోట్లు మాత్రమే. ఈస్ట్ 19కోట్లకు కొంటే 7కోట్లు పోయింది. వెస్ట్ 5.83కోట్లు పెడితే మొత్తం రికవర్ అయింది. లాభం మాత్రం రాలేదు. కృష్ణా 9.60కోట్లు పెడితే దాదాపుగా ఐదు కోట్లు పోయింది. గుంటూర్ 16.80కోట్లకు కొంటే 7 కోట్లు పోయింది. నెల్లూర్ 4.13 కోట్లకు కొంటే లాభం లేదు నష్టం లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 124 కోట్లకు అమ్మితే వచ్చింది 80 కోట్లే. కర్ణాటక 28కోట్లకు కొన్నారు. 16 కోట్లు పోయింది. తమిళనాడు 20 కోట్లకు కొన్నవారికి 6 కోట్ల నష్టం వచ్చింది. కేరళ 6కోట్లకు కొంటె 2 కోట్లు పోయాయి. నార్త్ ఇండియా 70 కోట్లకు అమ్మితే బయ్యర్లకు 6.62 కోట్ల లాభాన్ని తెచ్చిపెట్టింది. ఓవర్సీస్ 42కోట్లకు కొంటే 10 కోట్లు నష్టం వచ్చింది. మొత్తంగా 290 కోట్లకు అమ్మితే బయ్యర్లకు 73.71 కోట్ల నష్టాన్ని `సాహో` మిగిల్చిందని లెక్క తేలింది. ఇంకా కొన్నిచోట్ల రన్నింగ్ లో ఉన్నా కసరు వసూళ్లు కిందే లెక్క. అయితే ఈ సినిమా ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ గా ఆవిష్కరించిందనడంలో సందేహం లేదు. కేవలం ప్రభాస్ ని.. మూవీ విజువల్ గ్రాండియారిటీని చూసేందుకే జనం థియేటర్లకు వచ్చారు.