అదే కథ మళ్లీ మనోళ్లు చూస్తారా?

అజిత్ నటించిన ‘విశ్వాసం’ ఇటీవల సంక్రాంతి పోటిలో దిగి తమిళనాడులో రజని పేటతో పోటి పడుతూ నడిచింది. అంతేకాకుండా పేటను ప్రక్కన పెట్టి హిట్టైంది. అయితే అదే సంక్రాంతికి ‘విశ్వాసం’ తెలుగులో మాత్రం థియేటర్స్‌కి రాలేదు. అందుక్కారణం ఇక్కడ థియేటర్లు దొరక్క పోవటమే. ఎన్టీఆర్ ‘కథానాయకుడు’, ‘వినయ విధేయ రామ’, ‘ఎఫ్ 2’ , పేట సినిమాలన్నీ థియోటర్స్ ని ఆక్రమించేయటంతో ‘విశ్వాసం’ రేసు నుంచి తప్పుకుంది.

ఇప్పుడు తమిళనాట మంచి హిట్ అయ్యాక ఇప్పుడు టాలీవుడ్‌కి వస్తున్నాడు అజిత్. ఫిబ్రవరి 1న విడుదలకి సన్నాహాలు చేస్తున్నారు తెలుగు నిర్మాతలు. ప్రస్తుతం డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తెలుగు వారికు నచ్చే నయనతార హీరోయిన్‌గా, జగపతి బాబు విలన్‌గా చేసిన ఈ సినిమా ఇక్కడ మంచి అంచనాలతో రిలీజ్ కానుంది. అంతవరకూ బాగానే ఉంది కానీ ‘విశ్వాసం’ కథ మన తెలుగులో వచ్చిన బోయపాటి సినిమా తులసి కు నకలుగా ఉందని టాక్. దాంతో తెలుగులో మళ్లీ అదే కథను ఆదరిస్తారా అనేది సందేహంగా మారింది.

ఇక తమిళనాడులో ఈ చిత్రం ఇప్పటికీ టాప్‌ కలెక్షన్లతో దూసుకుపోతోంది. మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించిన ఈ మూవీ వసూళ్లలో ముందంజలో ఉంది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు మొదటి రోజు విశ్వాసం దాదాపు 26కోట్లను వసూళు చేసినట్టు తెలుస్తోంది. వేదాలం, వివేగం, వీరం లాంటి హ్యాట్రిక్‌ హిట్స్‌ తరువాత శివ డైరెక్షన్‌లో నటించిన విశ్వాసం కూడా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. సత్య జ్యోతి ఫిలిమ్స్ వారు నిర్మించిన ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం ఇచ్చి స్వరపరిచారు. మరి ఇక్కడి ప్రేక్షకులు ఈ మూవీకి ఎలాంటి తీర్పు ఇస్తారో వేచి చూడాలి.