“2.0”:చైనా రిలీజ్..ఎన్ని స్క్రీన్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు

సూపర్ స్టార్ రజినీ కాంత్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 2.0. ఈ సినిమా మొన్న గురువారం విడుదలై బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. లింగ , కబాలి , కాలా చిత్రాలతో నిరాశ పరిచిన రజినీ మళ్ళీ ఈ చిత్రం తో ఫామ్ లోకి వచ్చారని అభిమానులు ఆనందంతో పండుగ చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ‘2.0’ చైనాలోనూ సందడి చేయటానికి రెడీ అవుతోంది.

ఈ సినిమాను చైనాలో కూడా విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ ప్రకటించింది. అక్కడ మొత్తం 56 వేల స్క్రీన్లపై సినిమాను ప్రదర్శించబోతున్నట్లు వెల్లడించింది. చైనాకు చెంది ప్రముఖ నిర్మాణ సంస్థ హెచ్‌వై మీడియాతో కలిసి ‘2.0’ను ఆ దేశంలో విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.

మే నెలలో ‘2.0’ సినిమా డబ్‌, సబ్‌ టైటిల్‌ వెర్షన్‌ను చైనా 10 వేల థియేటర్లలోని 56 వేల స్క్రీన్లపై (47వేల+ 3డీ స్కీన్లు) విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీంతో ఈ చిత్రం చైనాలో కూడా చరిత్ర సృష్టించబోతోందని అంచనా వేస్తున్నారు.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన చిత్రం ‘2.0’. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ విలన్ పాత్ర పోషించారు. అమీ జాక్సన్‌ కథానాయిక. ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందించారు. 2010 హిట్‌ ‘రోబో’కు సీక్వెల్‌ ఇది. ఈ సినిమా ఇప్పటికే వసూళ్ల పరంగా రికార్డు సృష్టించింది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.400 కోట్లు రాబట్టినట్లు ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటించింది.

తెలుగు రాష్ట్రాల్లో 2.0 హక్కులను రూ.. 75 కోట్లకు అమ్మారు . ఐదు రోజులకు గానూ ఈ చిత్రం రూ. 36.08 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించింది. ఇక తమిళ నాడులో దాదాపు రూ. 100 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్మారని సమాచారం.