‘టాక్సీవాలా’రిలీజ్ డేట్ ఛేంజ్…రీజన్ ఇదే

విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘టాక్సీవాలా’ రిలీజ్ డేట్ మారింది. ఈ చిత్రం ఒక్కరోజు ఆలస్యంగా విడుదల అవనుంది. మొదట ఈచిత్రాన్ని నవంబర్ 16న విడుదల చేస్తున్నట్లుగా నిర్మాతలు ప్రకటించారు. అయితే అదే రోజున రవితేజ నటించిన ‘అమర్ అక్బర్ ఆంటొని’ విడుదలవుతుండడంతో టాక్సీవాలా ను నవంబర్ 17న విడుదల చేస్తున్నట్లుగా కొద్దీ సేపటి క్రితం అధికారంగా ప్రకటించారు. ఈ మేర‌కు పోస్ట‌ర్స్ కూడా విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఒకేరోజు రెండు సినిమాలు వ‌స్తే క‌చ్చితంగా ఇద్ద‌రికీ న‌ష్ట‌మే. అందుకే ఒక‌రోజు ఆల‌స్యంగా వ‌స్తున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌

నూతన దర్శకుడు రాహుల్ సంక్రుత్యాన్ తెరకెక్కించిన ఈచిత్రంలో ప్రియాంక జవల్కర్ హీరోయిన్ గా నటించింది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు యూవీ క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మించాయి. అంచనాలకు ఏ మాత్రం తీసుపోకుండా టాక్సీవాలా చిత్రం రూపుదిద్దుకుంటుందని, విజయ్ కెరియర్‌లో మరో మైలురాయిగా నిలిచిపోయే చిత్రంగా ‘టాక్సీవాలా’ ఉండబోతోందని చిత్ర యూనిట్ తెలుపుతుంది.

అలాగే ఇప్ప‌టికే విడుద‌లైన మాటే విన‌దుగా పాట బాగా వైర‌ల్ అవుతోంది. స‌స్పెన్స్ కామెడీగా వ‌స్తున్న టాక్సీవాలా క‌చ్చితంగా హిట్ అవుతుంద‌ని ధీమాగా ఉన్నాడు విజ‌య్.