Omicron Vs Sankranthi : ఒమిక్రాన్ వర్సెస్ సంక్రాంతి: సినిమా టెన్షన్ మామూలుగా లేదు.!

Omicron Vs Sankranthi : తెలుగు సినిమాకి పెద్ద కష్టమే వచ్చి పడింది. సంక్రాంతి సీజన్‌ని క్యాష్ చేసుకునేందుకు రెండు పెద్ద సినిమాలు బరిలోకి దిగాయి. కానీ, అంతకన్నా ముందు ఒమిక్రాన్ రంగంలోకి దిగేసింది.

తెలుగు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ పాన్ ఇండియా సినిమాలు కావడంతో, దేశంలో ఎక్కడ థియేటర్లపై ఆంక్షలున్నా, ఆ రెండిటి పరిస్థితీ తెలుగు రాష్ట్రాలతో సంబంధం లేకుండా అయోమయంలో పడిపోతుంది.

‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడుతుందట, ‘రాధేశ్యామ్’ రిస్క్ తీసుకోవాలనుకోవడంలేదట.. అంటూ సినీ వర్గాల్లో చర్చోపచర్చలు, ఊహగానాలు నడుస్తున్నాయి. అయితే, ప్రమోషన్ల విషయంలో రెండు సినిమాలూ ఎక్కడా తగ్గడంలేదు.

మహారాష్ట్రలో ఇప్పటికే ఆంక్షలు మొదలయ్యాయి. దేశంలో పలు రాష్ట్రాలూ అదే బాటలో పయనిస్తున్నాయి. డిసెంబర్ 31 తర్వాత పరిస్థితులు ఎలా వుంటాయో ఇప్పుడే చెప్పలేం. ఆంక్షలు పెరుగుతాయి తప్ప, తగ్గే అవకాశాలైతే లేవు.

మరెలా, ఆంక్షల నడుమ పెద్ద సినిమాలు విడుదలవడం శ్రేయస్కరం కాదు నిర్మాతలకైనా, పంపిణీదారులకైనా, ఎగ్జిబిటర్లకైనా. ఈ పరిస్థితుల్లో ‘వాయిదా’ తప్ప ఇంకో మార్గమే లేదన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ‘భీమ్లానాయక్’ సినిమాని పక్కకి తప్పించేశామన్న ఆనందం ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ నిర్మాతలకీ, ఇంకొందరికి ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు.