అక్కడ అక్షయ్ కుమార్, ఇక్కడ ప్రభాస్

‘మనోవిరాగి’ పోస్టర్ రిలీజ్ చేసిన ప్రభాస్

భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితంపై మరో సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఛాయ్‌ అమ్ముకునే స్థాయి నుంచి దేశ ప్రధానిగా మన్ననలు పొందే స్థాయికి ఎదిగిన ఆయన కథను బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాను హిందీతోపాటు తెలుగులోనూ తెరకెక్కిస్తున్నారు. చిత్రం ఫస్ట్‌లుక్‌ను హీరో ప్రభాస్‌ విడుదల చేశారు. దీనికి ‘మనోవిరాగి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా హిందీ పోస్టర్‌ను అక్షయ్‌ కుమార్‌ షేర్‌ చేశారు.

‘ప్రత్యేక వ్యక్తిపై ప్రత్యేక నిర్మాతలు తీస్తున్న ప్రత్యేక సినిమా ఫస్ట్‌లుక్‌ను ప్రత్యేకమైన రోజున విడుదల చేస్తున్నాం. పుట్టినరోజు శుభాకాంక్షలు మోదీ సర్‌. సంజయ్‌లీలా భన్సాలీ, మహవీర్‌ జైన్‌ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఇది ప్రధాని అన్‌టోల్డ్‌ స్టోరీ. సంజయ్‌ త్రిపాఠి దర్శకత్వం వహిస్తున్నారు’ అని ప్రభాస్‌ పోస్ట్‌ చేశారు.

ఈ చిత్రం గురించి భన్సాలీ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ కథ కోసం చాలా పరిశోధనలు చేశాం. యువకుడిగా ఉన్నప్పుడు ప్రధాని మోదీ జీవితం మలుపు తిరిగిన విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది అందరికీ తెలియని కథ.. తెలుసుకోవాల్సిన కథ’ అని అన్నారు. ఈ సినిమా ద్వారా ప్రధాని యుక్త వయసులో ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారో చూసే అవకాశం ప్రేక్షకులకు కలుగనుంది.