వలస కార్మికుల జీవన చిత్రం “మట్టి మనుషులు “

28 ఏళ్ల నాటి సంగతి

నిర్మాత , దర్శకుడు, నటుడు, చిత్ర కారుడు , సంగీత దర్శకుడు బి . నరసింగ రావు గారితో నాకు 1980 నుంచి పరిచయం వుంది .  బెంగాలీ దర్శకుడు గౌతమ్ ఘోష్ తో “మాభూమి ” చిత్రం నిర్మించారు . నరసింగరావు , జి . రవీంద్ర నాథ్ ఇద్దరు తెలంగాణ చరిత్రపై తీసిన మహోన్నత సినిమా . ఈ సినిమాలో సాయిచంద్ తో పాటు నరసింగ రావు కూడా నటించారు . కిషన్ చాంద్ నవలను సినిమాగా తీశారు . వింజమూరి సీతాదేవి ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు . గద్దర్ పాడిన పాటలు ప్రజలను ఉర్రుత లూగించాయి. ఆ సినిమా నిర్మాణంలో నరసింగ రావు గారు నాకు పరిచయం . జర్నలిస్టుగా వారిని తరచూ హైదరాబాద్ సారధి స్టూడియోస్ లో కలిసేవాడిని . ఆ సినిమా రికార్డింగ్, రే రికార్డింగ్ , ఎడిటింగ్ , డబ్బింగ్ అంతా సారధి స్టూడియోస్ లోనే జరిగింది .

ఆ సినిమా నిర్మాణం ఓ ఉద్యమాలా సాగింది . . ఇక మాభూమి సినిమా చూడటానికి ప్రజలు జాతరలా థియేటర్ లకు వచ్చేవారు . ఈసినిమాకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డును ఇచ్చి సత్కరించింది . ఆ తరువాత నరసింగ రావుకు సినిమా అంటే ప్రాణంగా మారిపోయింది . 1983లో ఆయన దర్శకత్వంలో “రంగులకల ” సినిమా వచ్చింది .

ఆ సినిమాకు కవి రచయిత దేవిప్రియ ఓ పాట రాయడంతో పాటు ఆ సినిమా ప్రచార బాధ్యత కూడా చూశారు .
ఆ తరువాత 1985లో “ది సిటీ ” 1987లో “మావూరు ” డాక్యుమెంటరీ చిత్రాలు తీశారు . నాపై వున్న నమ్మకంతో నరసింగ రావు గారు వీటి ప్రచార బాధ్యత నాకు అప్పగించారు . అప్పటి నుంచి ఆయన సినిమాల ప్రచార భాద్యత నేనే చూసేవాడిని . నరసింగరావు గారి సినిమాల నిర్మాణ బాధ్యత అంతా వారి సోదరుడు వేదకుమార్ చూసేవారు . అలాగే నరసింగ రావు దర్శకత్వ టీమ్ లో పనిచేసే వి . కృష్ణారావు కూడా చాలా స్నేహపాత్రంగా ఉండేవారు .

1988లో తెలంగాణలో ఒకప్పుడు దొరల గడీల్లో జరిగిన దురాచారాలపై తీసిన సంచలన చిత్రం “దాసీ ” ఈ సినీమాకు ఐదు జాతీయ అవార్డులు వచ్చాయి . ఈ చిత్రంలో భూపాల్ రెడ్డి , అర్చన , రూపాదేవి తదితరులు నటించారు . మాస్కో ఫిలిం ఫెస్టివల్ లో మెరిట్ సర్టిఫికెట్ వచ్చింది .

1990 లో నరసింగ రావు దర్శకత్వంలో నిర్మించిన “మట్టిమనుషులు ” చిత్రంలో అర్చన, నీనా గుప్తా , మొయిన్ ఏ బేగ్ నటించారు . పల్లెటూళ్ళ నుంచి నగరానికి వలస వచ్చిన కార్మికుల జీవన చిత్రమే ఈ సినిమా . ఈ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది . మాస్కో ఫిలిం ఫెస్టివల్ లో కూడా ప్రదర్శితమై మెరిట్ సర్టిఫికెట్ సంపాదించింది .

1991లో చెన్నయ్ లో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవం ఇండియన్ పనోరమ్ విభాగంలో ఈ సినిమా ప్రదర్శితమైంది . అప్పుడు “మట్టిమనుషులు ” చిత్రానికి పనిచేసిన వారిని ఫెస్టివల్ వారు ఆహ్వానించారు . నరసింగరావు గారు నన్ను కూడా చెన్నయ్ ఆహ్వానించారు . జనవరి 12న చిత్రోత్సవంలో మట్టిమనుషులు చిత్ర ప్రదర్శన అనంతరం మమ్మల్ని స్టేజి మీదకు ఆహ్వానించారు . అప్పుడు తీసిన ఫోటో ఇది . ఇందులో నరసింగ రావు, అర్చన, వేదకుమార్, సుదర్శన్, శరత్ బాబు, ప్రాణ్ రావు ,బేగ్ , ముఖర్జీ , నేను వున్నాము ఇప్పటికి 28 సంవత్సరాలు అవుతుంది . ఇదొక మర్చిపోలేని అనుభవం .
-భగీరథ