కొత్త చర్చ… పెద్దాయన ఎంట్రీతో వైసీపీలోకి షర్మిళ!

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిళ ప్రధాన చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం.. అక్కడ కాంగ్రెస్ కోసం ఆమె పోటీ నుంచి తప్పుకుని ఆ పార్టీకి బయటనుంచి మద్దతు ఇవ్వడం.. అనంతరం ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనంచేసి రాజ్యసభకు వెళ్తారని చర్చ తెరపైకి రావడం తెలిసిందే. అయితే… షర్మిళ ఒకటి తలిస్తే… కాంగ్రెస్ మరొకటి తలస్తుందని.. ఆమెను ఏపీ పీసీసీ చీఫ్ గా పంపాలనుకుంటున్నారని అంటున్నారు.

ఈ సమయంలో ఏపీలో భారీ చర్చ మొదలైంది. ఇందులో భాగంగా… వైఎస్ షర్మిళ ను ఏపీకి చీఫ్ గా పంపించి కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకురావాలని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారని కొందరంటే… షర్మిళను ఏపీకి పంపడం వల్ల జగన్ ఓటు బ్యాంకులో చీలిక తీసుకురావొచ్చని కూడా మరోపార్టీలో లోపాయకారీ ఒప్పందం జరిగిందని మరికొందరు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఊహించని ఒక విషయం తెరపైకి వచ్చింది. వైఎస్ షర్మిళ వైసీపీలోకి వెళ్లబోతున్నారనేది ఆ విషయం!

అవును… వైఎస్ జగన్ జైల్లో ఉన్నప్పుడు ఏ పార్టీకోసం పాదయాత్ర చేశారో ఆ జగనన్న వదిలిన బాణం తిరిగి ఆ పార్టీ అంబుల పొదిలోకి చేరబోతుందనే చర్చ మొదలైంది. అన్నా చెళ్లెళ్లు ఇలా వేరు వేరు పార్టీల్లో ఉండి ఫైట్ చేసుకోవడం వల్ల జనాల్లోకి నెగిటివ్ సంకేతాలు వెళ్తాయని.. ఫలితంగా రొట్టెముక్క కోసం రెండు పిల్లులు దెబ్బలాడుకుంటే.. కోతి వచ్చి ఎత్తుకుపోయినట్లు ఉంటుందని అంటున్నారు!

ఈ సమయంలో ఒక పెద్దాయన రంగప్రవేశం చేశారని తెలుస్తుంది. ఇందులో భాగంగా… వైఎస్ షర్మిలకు ఏమి కావాలి.. ఆమె రాజకీయ ఆలోచనలు ఏమిటి.. అనే విషయాలు తెలుస్కోవడంతోపాటు ఆమెను తిరిగి వైసీపీలోకి తీసుకుని వచ్చే బాధ్యత కూడా ఆ పెద్దాయన తీసుకుంటారని అంటున్నారు. పైగా ఆయన మాటను అటు జగన్ కానీ, ఇటు షర్మిళ కానీ తీసివేయరని అంటున్నారు.

ఇదే సమయంలో… షర్మిలను వచ్చే ఎన్నికల్లో కడప నుంచి ఎంపీగా పోటీ చేయించేందుకు కూడా వైసీపీ హై కమాండ్ సుముఖంగా ఉందని కథనాలొస్తున్నాయి. ఆ విధంగా ఆమె రాజకీయ ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు ఆమెకు సంబంధించిన ఆస్తుల వివాదాలు ఏమైనా ఉంటే సానుకూలంగా పరిష్కరించడానికి ఆ పెద్దమనిషి చొరవ తీసుకుంటున్నారని తెలుస్తుంది. అదే జరిగితే ఇక వైఎస్ ఫ్యామిలీకి ఏపీ రాజకీయాల్లో తిరుగుండదని భావిస్తున్నారని తెలుస్తుంది.

దీంతో ఈ విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో.. ప్రత్యేకంగా అధికార వైసీపీలో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. అదే జరిగితే ఇక ఏపీలో వైసీపీకి ఏ రకంగానూ తిరుగు ఉండదని.. ప్రత్యర్థుల విమర్శలకు సైతం చెక్ పెట్టినట్లు ఉంటుందని భావిస్తున్నారంట. మరి ఆ పెద్దాయన ఎంట్రీ ఎప్పుడు ఉండబోతుంది.. ఈ ఫ్యామిలీ సమస్యకు పరిష్కారం ఏ విధంగా రాబోతుందనేది వేచి చూడాలి!