వైసీపీకి ఈ ఎమ్మెల్యేలు వద్దు బాబోయ్.!

2024 ఎన్నికలకు సంబంధించి ‘వై నాట్ 175’ అంటోంది వైసీపీ. మరి, వైసీపీని గెలిపించే ఎమ్మెల్యేలు ఎవరు.? ఈ ప్రశ్నకు వైసీపీలోనే సరైన సమాధానం దొరకడంలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో సానుకూలత వున్నాగానీ, ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. నియోజకవర్గం మొహం చూడని ఎమ్మెల్యేలు, నియోజకవర్గంలోనే వున్నా ప్రజలకు అందుబాటులో లేని ఎమ్మెల్యేలు.. చెప్పుకుంటూ పోతే, అదో పెద్ద కథ. కథ కాదు, వ్యధ.! ఈ విషయమై అధినేత వైఎస్ జగన్ పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నా ఎమ్మెల్యేలలో మార్పు రావడంలేదు.

‘ఆ ఎమ్మెల్యేలకు ఇంకోసారి టిక్కెట్ వచ్చే అవకాశం లేదు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పడంతో, పార్టీ ఫిరాయించారు..’ అంటూ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల వేళ నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను, వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచే అసలు కథ మొదలైంది. ఎక్కడికక్కడ, ‘ఈ ఎమ్మెల్యే వద్దు మొర్రో..’ అంటూ వైసీపీ స్థానిక నేతలే నిరసన గళం వినిపించడం మొదలు పెట్టారు.

మంత్రి అంబటి రాంబాబుకి కూడా ఈ సెగ తగిలింది. మరో మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిస్థితి కూడా అలానే వుంది. మంత్రులుగా వున్నవారిలో నలుగురైదుగురు తప్ప, మిగతావారందరి పరిస్థితీ ఇదే. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం స్థానిక వైసీపీ నాయకత్వం నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి టీమ్‌తో వైఎస్ జగన్ నెట్టుకొచ్చేదెలా.?