గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెట్టని కోతలు అనదగిన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. వాటిలో పొన్నూరు నియోజకవర్గం కూడ ఒకటి. రాష్ట్రంలో ఎక్కడ ఎలా ఉన్నా పొన్నూరులో మాత్రం విజయం టీడీపీదే అన్నట్టు ఉండేది పరిస్థితి. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి రాజకీయాన్ని ధూళిపాళ్ల కుటుంబమే శాసిస్తోంది. ఈ ఫ్యామిలీ నుండి రెండు తరాల నాయకులు ఉన్నారు. 83 నుండి 89 వరకు ధూళిపాళ్ల వీరయ్య చౌదరి టీడీపీ నుండి మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఇక 94 నుండి 2014 వరకు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఐదుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఆరవసారికూడ ఎమెమ్మెల్యే అయి డబుల్ హ్యాట్రిక్ కొట్టాలని అనుకున్నారు నరేంద్ర కుమార్. కానీ అనూహ్యంగా వైసీపీ దెబ్బకొట్టింది.
జగన్ గాలిలో కిలారి వెంకట రోశయ్య ఎమ్మెల్యే అయ్యారు. అది కూడ 1000 ఓట్ల తేడాతోనే. నరేంద్ర కుమార్ ఓడిపోయినా కూడ ఆయన బలం, బలగం తగ్గలేదు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంటే ఈయనకే పాపులారిటీ ఎక్కువగా ఉంటోంది. నరేంద్రకుమార్ సైతం ఓటమిని పెద్దగా పట్టించుకోకుండా ఎప్పటిలాగే వ్యవహరిస్తున్నారట. ప్రభుత్వంతో పని లేకుండా కొన్ని పనులు ఆయన స్వయంగా చేసి పెడుతున్నారట. దీంతో ఆయన క్యాడర్ చాలా భద్రంగా ఉంది. దీంతో ఈయన మీద ఎలా ఫైట్ చేయాలో వైసీపీ ఎమ్మెల్యేకు అస్సలు తెలియట్లేదట. అవినీతి మరకలు, ఆరోపణలు లేకపోవడంతో ఈయన్ను టార్గెట్ చేయడం అస్సలు కుదరట్లేదట.
ఇక త్వరలో పంచాయతీ ఎన్నికలు రానున్నాయి. ఎమ్మెల్యేలంతా తమ తమ నియోజకవర్గాల్లో వీలైనంతవరకు వైసీపీకి ఏకగ్రీవాలు అయ్యేలా చూడాలని హైకమాండ్ సూచించింది. కానీ పొన్నూరులో అలాంటి సిట్యుయేషన్ లేదట. ఏకగ్రీవాలు అంటూ జరిగితే అది టీడీపీకి జరిగే పరిస్థితి ఉందట. ఎన్నికలకు వెళ్లినా రిజల్ట్ టీడీపీ వైపే ఉండేలా కనిపిస్తోంది. అదే ఎమ్మెల్యేను కంగారుపెట్టేస్తోంది. రేపటి రోజున ఏకగ్రీవాలు అక్కడని హైకమాండ్ అడిగితే ఏం సమాధానం చెప్పాలోనని మధనపడిపోతున్నారట. ధూళిపాళ్ల మాత్రం ఇప్పటికే శ్రేణులను కూడదీసి ఏకగ్రీవాల మీద, కుదరని పక్షంలో ఎన్నికలకు వెళ్లే విషయమై పక్కా స్కెచ్ సిద్ధం చేసుకున్నారట.