టీడీపీలో చేరనున్న వైసీపీ ఎమ్మెల్యే.!

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ మారడం దాదాపు ఖాయమైపోయింది. తాను పార్టీ మారబోతున్న విషయాన్ని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన అనుచరులతో చెప్పేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతున్నదిగా చెప్పబడుతున్న ఓ ఆడియో టేపు బయటకు వచ్చింది.

మంత్రి వర్గ విస్తరణలో చోటు కోసం కోటంరెడ్డి తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. అయినాగానీ, జగన్ వెంటే తాను వుంటానని చెప్పుకొచ్చారాయన. అయితే, నెల్లూరు జిల్లాలో మారిన రాజకీయ పరిస్థితులు.. మరీ ముఖ్యంగా పార్టీలో తనకు దక్కుతున్న ప్రాధాన్యత.. వెరసి, కోటంరెడ్డిని పార్టీ మార్పు దిశగా ప్రేరేపించినట్లు తెలుస్తోంది.

మరోపక్క, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రత్యామ్నాయం ఆలోచిస్తోంది వైసీపీ అధినాయకత్వం. తాను పార్టీలో వుండగానే, తనకు ప్రత్యామ్నాయాన్ని పార్టీ వెతకడం పట్ల మరింత అసహనానికి గురవుతున్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మార్పు నిర్ణయం తీసుకున్నారట. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తానంటూ అనుచరులు, కార్యకర్తలకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పేయడంతో.. నెల్లూరు రాజకీయం రసవత్తరంగా మారింది. నెల్లూరుకే చెందిన మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా వున్న సంగతి తెలిసిందే.