ఈ పది రోజులూ పేర్ని నాని ఫుల్ బిజీ!

జనసేన వారాహి యాత్ర మొదలవుతుంది. ఈ రోజు సాయంత్రం కత్తిపూడిలో జరిగే తొలి బహిరంగ సభలో పవన్ ఈ వాహనం పైనుంచి ప్రసంగించనున్నారు. అయితే 10 రోజులు పాటు జరిగే ఈ యాత్రలో 9 నియోజకవర్గాలను పవన్ కవర్ చేయనున్నారు. ఈ సందర్భంగా 7 బహిరంగసభల్లో జనసేనాని ప్రసంగించనున్నారు. దీంతో… ఈ పదిరోజులూ పేర్ని నాని ఫుల్ బిజీ అయిపోతారనే కామెంట్స్ ఆన్ లైన్ వేదికగా దర్శనమిస్తున్నాయి.

ఏపీ అధికారపార్టీలో విపక్షాలపై విరుచుకుపడటానికి ప్రత్యేకంగా ఒక టీం ఉంది! వీరిలో కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, వల్లభనేని వంశీ, జోగి రమేష్, అనీల్ కుమార్ యాదవ్, అమర్నాథ్ ఇలా ఒక టీం… సందర్భాన్ని బట్టి, ప్రత్యర్థిని బట్టి మైకందుకుంటారు. అనంతరం విరుచుకుపడిపోతారు. వీరిలో కొంతమంది విమర్శలతో వీర ఊచకోత కోసేవారైతే… మరికొంత మంది సున్నితంగా దింపేసేవారు! వారిలో పేర్ని నాని స్టైల్ ప్రత్యేకం!

పైగా పవన్ కల్యాణ్ అధికారపార్టీపై ఎప్పుడు విమర్శలు చేసినా… ఆ ప్రెస్ మీట్ / ఆ సభ అయిపోగానే పేర్ని నాని మైకులముందుకు వస్తారు. ఈ సమయంలో పవన్ ప్రసంగాలు పూర్తవ్వగానే పేర్ని నాని స్పందన కోసం ఎదురుచూసేవారు ఉంటారన్నా అతిశయోక్తి కాదు! ఆ స్థాయిలో పవన్ ప్రస్థావించిన ప్రతీ విషయాన్ని, చేసిన ప్రతి విమర్శనీ సవివరంగా వివరిస్తూ పేర్ని నాని వేసే కౌంటర్లు, సెటైర్లు పీక్స్ లో ఉంటాయి.

ఇక ఎన్నికల ప్రచార యాత్రకు బయలుదేరిన పవన్.. తనకు బలం పెరిగిందని చెబుతున్న గోదావరి జిల్లాల్లో మరింతగా అధికారపార్టీపై విరుచుకుపడిపోతారు. దీంతో…ఈ పది రోజులూ పేర్ని నాని ఫుల్ బిజీ అయిపోతారనడంలో సందేహంలేదు. అయితే రాజకీయాంగా చైతన్యం కలిగిన గోదావరి జిల్లాల్లో పవన్ ప్రసంగాలు ఏ విధంగా సాగుతాయనేది అత్యంత కీలకం!

సాధారణంగా పవన్ బహిరంగ సభల్లో ప్రసంగించినప్పుడు జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంటారు. అయితే అవి కనస్ట్రక్టివ్ గా ఉండవన్న విమర్శ ఉంది. తిట్టాలి కాబట్టి తిడదాం అన్నట్లుగా ఊకదంపుడుగా కాకుండా… ఈ యాత్రలో అయినా కనస్టక్టివ్ గా పవన్ విమర్శలు ఉండాలని జనసేన నేతలు కోరుకుంటున్నారు. అలాకానిపక్షంలో… జనసైనికుల కేరింతలు మాత్రమే మిగిలుతాయి తప్ప… ప్రజల్లో చర్చ అయితే కలిగించే పరిస్థితి ఉండకపోవచ్చని అంటున్నారు పరిశీలకులు.