వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అధికార వైసీపీ మీద ఏ స్థాయిలో మాటల దాడి చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా దానిలో లోపాలు వెతకడమే పనిగా పెట్టుకున్నారు రాజుగారు. ఢిల్లీలో ఉంటూ రచ్చబండ పేరుతో మీడియా ముందుకొస్తున్న ఆయన ప్రభుత్వం నుండి ఎలాంటి నిర్ణయం వెలువడినా, అధికారపక్ష నాయకులు ఏం మాట్లాడినా, రాష్ట్రంలో చీమ చిటుక్కుమన్నా విశ్లేషణ చేసేస్తున్నారు. రాజధాని భూములు, ఇంగ్లీష్ మీడియం నుండి తాజాగా జరిగిన అంతర్వేది రథం దగ్దం వరకు చాలా విషయాల్లో ప్రభుత్వాన్ని వేలెత్తి చూపారాయన. ఆయన విశ్లేషణల్లో లాజిక్కులు ఉండటంతో జనం కూడ వాటి గురించి ఆలోచిస్తున్నారు. అయితే సొంత ఎంపీనే ఇలా తల మీద కుంపటిలా మారడంతో వైసీపీ హైకమాండ్ ఆగ్రహిస్తోంది.
ఏదైనా సమస్య ఉంటే నేరుగా మాట్లాడాలి కానీ ఇలా విపక్షం అవతారమెత్తి ఇబ్బందులకు గురిచేస్తారా అంటూ మండిపడుతున్నారు. మొదట్లో లైట్ తీసుకున్నా తర్వాతా సీన్ సీరియస్ అయింది. సదరు ఎంపీ మీద అనర్హత వేటు వేయించాలని వైసీపీ నేతలు నేరుగా లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాను కలిసి అనర్హత పిటిషన్ సమర్పించారు. ప్రజెంట్ అది ఆయన వద్దే ఉంది. ఇంకా స్పీకర్ నిర్ణయం తెలుపలేదు. అవతలేమో రఘురామరాజు దాడి రోజురోజుకూ పెరిగిపోతోంది. దీంతో ఏదో ఒకటి తేల్చిపారేయాలని జగన్ సర్కార్ భావిస్తోందట. అందుకు పార్లమెంట్ సమావేశాలను వేదికగా చేసుకోవాలని అనుకుంటున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి.
ఈ నెల 14 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆరంభంకానున్నాయి. ఈ సమావేశాల్లో స్పీకర్ రఘురామరాజు అనర్హత పిటిషన్ మీద నిర్ణయం తీసుకునేలా చేయాలని భావిస్తోందట. అందుకే సమావేశాలకు ముందే స్పీకర్ గారిని కలిసి రఘురామరాజుపై అనర్హత పిటిషన్ అంశాన్ని గుర్తుచేసి ఆ ఫైల్ ముందుకు కదిలేలా చూడాలని వైసీపీ హైకమాండ్ భావన అని అంటున్నారు. అయితే ఈ కథనాలను అధికారపక్షం నేతలు ఎక్కడా అధికారికంగా ప్రస్తావించలేదు. కాబట్టి ఇప్పటికి వీటిని రూమర్లుగానే పరిగణించి సమావేశాల వరకు వేచి చూడాలి. ఒకవేళ ఇదే నిజమైతే అసలే పార్లమెంట్ సమావేశాలు తక్కువ సమయం జరగనున్న నేపథ్యంలో కీలక బిల్లులే చర్చకు రానున్నాయి. ముఖ్యమైన ప్రశ్నోత్తరాలు కూడ జరగట్లేదు. అలాంటప్పుడు రఘురామకృష్ణరాజుపై అనర్హత పిటిషన్ చర్చకు వస్తుందా అనేదే ప్రశ్న.