కుప్పంలో వైసీపీ గెలిచి తీరుతుంది: వైసీపీ నేత భరత్.!

‘కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఓడించి తీరతాం..’ అంటున్నారు వైసీపీ నేత భరత్. భరత్‌కి మంత్రి పదవిని కూడా ఎరవేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ‘భరత్‌ని కుప్పంలో గెలిపిస్తే, ఆయన్ని మంత్రిని చేస్తాను..’ అంటూ ఇటీవల కుప్పంకి చెందిన వైసీపీ కింది స్థాయి నేతలు, కార్యర్తల సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం విదితమే.

గత కొంతకాలంగా కుప్పంలో చంద్రబాబు పర్యటించిన ప్రతిసారీ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు పర్యటనలపై వైసీపీ సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. అదే సమయంలో వైసీపీ కార్యకర్తలకు వైసీపీ సర్కారు ‘ఫ్రీ హ్యాండ్’ ఇచ్చేసింది. ఈ క్రమంలోనే వైసీపీ కార్యకర్తలు, ఎన్ఎస్‌జీ రక్షణలో వున్నప్పటికీ చంద్రబాబుపై దాడికి యత్నిస్తున్నారు.

పోలీసులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండడంతో వైసీపీ కార్యకర్తలు కుప్పంలో మరింత చెలరేగిపోతున్నారు.
మరోపక్క, వైసీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టడంలో చంద్రబాబు తనదైన వ్యూహాల్ని అమలు చేస్తున్నారు. ఏదన్నా అనుకోని ఘటన జరిగితే, తన పట్ల సింపతీ పెరుగుతుందని చంద్రబాబు భావిస్తోంటే, చంద్రబాబు మీద దాడి చేసైనాసరే.. కుప్పంలో రాజకీయంగా పై చేయి సాధించాలనే లక్ష్యంతో స్థానిక వైసీపీ నాయకత్వం వున్నట్లు కనిపిస్తోంది.

వెరసి, ప్రతిసారీ కుప్పంలో రణరంగమే కనిపిస్తోంది.. చంద్రబాబు పర్యటించిన సందర్భంలో. ‘అబ్బా కొడుకులు కుప్పం వచ్చిన ప్రతిసారీ గొడవలు జరుగుతున్నాయ్..’ అని స్వయానా వైసీపీ నేత భరత్ అంగీకరించడం గమనార్హం.
‘పుంగనూరు పుడింగి..’ అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చంద్రబాబు తదితరులు అవాకులు చెవాకులు పేలడం వల్లనే ఈ పరిస్థితి అన్నది భరత్ వాదన.