Minister Mandipalli: ‘స్త్రీ శక్తి’ పథకం విజయాన్ని చూసి వైసీపీకి అసూయ: మంత్రి మండిపల్లి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘స్త్రీ శక్తి’ మహిళా ఉచిత బస్సు ప్రయాణ పథకంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ (వైసీపీ) చేస్తున్న విమర్శలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పథకం దిగ్విజయంగా అమలవుతుండటాన్ని చూసి ఓర్వలేక, కడుపుమంటతోనే వైసీపీ నేతలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఎన్నికల హామీలలో భాగంగా ‘సూపర్ సిక్స్’ పథకాల అమలును కూటమి ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఐదు రకాల ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. అయితే, ఈ పథకం అమలులో అక్కడక్కడా కనిపిస్తున్న చిన్నపాటి లోపాలను ఎత్తిచూపుతూ వైసీపీ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి మండిపల్లి మీడియా సమావేశంలో మాట్లాడారు.

“లక్షలాది మంది అక్కచెల్లెమ్మలకు మేలు చేసే స్త్రీ శక్తి పథకం ప్రభుత్వానికి భారం కాదు, అదొక పవిత్ర బాధ్యత. ప్రజలకు మేలు చేసే ప్రతీ పథకాన్ని అవహేళన చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుంది. పథకం విజయవంతం కావడం వారికి నచ్చడం లేదు,” అని మంత్రి అన్నారు.

ప్రయాణ సమయంలో గుర్తింపు కార్డుల విషయంలో వస్తున్న విమర్శలపై మంత్రి స్పష్టతనిచ్చారు. “ప్రయాణానికి ఆధార్, పాన్, ఓటర్ కార్డుల వంటి గుర్తింపు కార్డుల ఒరిజినల్స్ తప్పనిసరి కాదు. వాటి జిరాక్సులు లేదా ఫోన్‌లోని సాఫ్ట్ కాపీలు చూపించినా అనుమతిస్తున్నాం. ఘాట్ రోడ్లలో నడిచే బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం వర్తిస్తుంది,” అని ఆయన తెలిపారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వాలే తప్ప, అక్కసుతో వ్యవహరించడం సరికాదని మంత్రి వైసీపీకి హితవు పలికారు. “మీ విమర్శలను, దుష్ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారు, హర్షించరు. ఇది సమంజసం కాదు,” అని ఆయన పేర్కొన్నారు.

తోలు తీస్తా || Analyst Ks Prasad Reacts On CM Chandrababu Strong Warning TO TDP MLAs || TeluguRajyam