టీడీపీ కంటే వైసీపీనే జనసేనకి బెటర్.!

వైసీపీని గుడ్డిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు.? ఏమో, ఆయనకే తెలియాలి. నిజమే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నుంచి వైసీపీలో చాలామంది నేతలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద తీవ్రస్థాయి విమర్శలు చేస్తుంటారు. వాటికి జనసేన కూడా గట్టిగానే కౌంటర్ ఎటాక్ ఇస్తుంటుంది.

మరి, టీడీపీ నేతలు జనసేన మీద చేసే విమర్శల సంగతేంటి.? ‘దత్త పుత్రుడు’ అన్న ప్రచారం కావొచ్చు, ‘ప్యాకేజీ స్టార్’ అన్న ప్రచారం కావొచ్చు.. తొలుత మొదలు పెట్టిందే టీడీపీ. ఇప్పటిదాకా, ఆ ప్యాకేజీ ఆరోపణల విషయంలో కావొచ్చు, దత్త పుత్రుడు విమర్శల విషయంలో కావొచ్చు, టీడీపీ వివరణ ఇచ్చుకున్న దాఖలాల్లేవు.

అయినా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీతోనే తన రాజకీయ ప్రయాణమంటున్నారు. ఇదెక్కడి వింత వాదన.! అధికార వైసీపీని రాజకీయంగా ఎదుర్కొనడానికి, టీడీపీతో పవన్ కళ్యాణ్ చేతులు కదిపితే, దాన్ని రాజకీయ వ్యూహం అనే అనొచ్చుగాక.. అది వేరే సంగతి.

కానీ, జనసేనతో కలవాల్సిన అవసరం వున్నా, జనసేనను పదే పదే ట్రోల్ చేస్తున్న టీడీపీ సంగతేంటి.? వాస్తవానికి సోషల్ మీడియాలో జనసేనను వైసీపీ కంటే ఎక్కువగా టీడీపీనే ట్రోల్ చేస్తుంటుంది.

జూనియర్ ఎన్టీయార్ అభిమానుల ముసుగులో, బాలకృష్ణ అభిమానుల ముసుగులో.. చివరికి అల్లు అర్జున్ ముసుగులోనూ జనసేన అధినేతను దారుణంగా ట్రోల్ చేస్తున్నది టీడీపీనే. టీడీపీకి చెందిన పలువురు సోషల్ మీడియా కింగ్ పిన్స్, స్పేస్‌లు పెట్టి మరీ, జనసేన అధినేతను నానా రకాల తిట్లూ తిడుతున్నారు.

టీడీపీ తిట్టినంతలా, వైసీపీ కూడా ఏనాడూ పవన్ కళ్యాణ్‌ని తిట్టి వుండదేమో.! రాష్ట్రం కోసం.. అంటూ, ఇన్ని అవమానాలు ఎదుర్కొంటే, సింపతీ వచ్చే అవకాశం లేదు. ‘చేతకానితనం’ అని జనసేన శ్రేణులే తమ అధినేత విషయంలో అనుకునే ప్రమాదం వుంది.