తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్టను దెబ్బతీసేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, భక్తుల మనోభావాలను గాయపరుస్తున్నారని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు.
భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని రాజు ఆరోపించారు. “తిరుపతిలో ఒకప్పుడు జిరాక్స్ సెంటర్ నడుపుకున్న నీకు వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో ప్రజలకు సమాధానం చెప్పాలి” అని ఆయన సూటిగా ప్రశ్నించారు. వైసీపీ నేతలు కేవలం కాలయాపన కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైన దేవస్థానంపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు.
ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ, సంస్థ ప్రతిష్టను పెంచేలా అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఆయన నాయకత్వంలో టీటీడీ పారదర్శకంగా ముందుకు వెళ్తోందని అన్నారు. “టీటీడీ డబ్బు ఒక్క రూపాయి కూడా ఎవరూ వాడుకోలేదు. అయినా టీటీడీపైన, చైర్మన్ పైన అనవసరంగా బురద చల్లుతున్నారు” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తీరుపై కూడా ఎంఎస్ రాజు విమర్శలు గుప్పించారు. “స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇవ్వమంటే నానా యాగీ చేస్తున్నారు. కనీసం స్వాతంత్ర్య దినోత్సవం రోజు జెండా కూడా ఎగరవేయని వ్యక్తి ఆయన” అని దుయ్యబట్టారు. వైసీపీ నేతలు చేసే అసత్య ఆరోపణలను నమ్మే స్థితిలో ఇప్పుడు ప్రజలు లేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సామాన్య భక్తులను అనేక సేవల్లో భాగస్వామ్యం చేసేలా టీటీడీ పనిచేస్తోందని ఎంఎస్ రాజు స్పష్టం చేశారు.


