నూట డెబ్భయ్ ఐదు ఆ తర్వాత.! ముందైతే, నూట యాభై ఒకటి జాగ్రత్త.!

కుప్పం మునిసిపాలిటీ గెలిచేశాం.. అదే ఓ అద్భుతం.. 175 అసెంబ్లీ సీట్లలోనూ గెలిచేయలేమా.? అంటూ పార్టీకి చెందిన కీలక నేతలతో సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలోనూ వ్యాఖ్యానించారు, తాజాగా ‘గడప గడపకీ మన ప్రభుత్వం’ కార్యక్రమానికి సంబంధించిన వర్క్ షాప్‌లోనూ అవే వ్యాఖ్యల్ని ఆయన చేశారు.

175 అసాధ్యమని ఎవరన్నారు.? ప్రజల మెప్పు పొందే పాలన అందిస్తే, రావొచ్చు. సంక్షేమం తప్ప, అభివృద్ధి రాష్ట్రంలో లేదు. ఆ సంక్షేమం కూడా అప్పులతో జరుగుతున్నదే. సంక్షేమమే ఓట్లను రాల్చుతుందనే భావనలో అధికార వైసీపీ వుంటే, అంతకన్నా హాస్యాస్పదం వుండదు.

స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఎలా గెలిచింది.? ‘మాకు ఓటెయ్యకపోతే మీకు సంక్షేమ పథకాలు దక్కవు..’ అని బెదిరించడం ద్వారా మాత్రమే. విపక్షాలకు చెందిన అభ్యర్థుల్ని బరిలో నిలబడనీయకుండా చేసి, వైసీపీ ‘మేమే గెలిచాం’ అనిపించుకుంది.

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక విషయంలో ఎంత యాగీ జరిగిందో చూశాం. ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికలు వేరు.. సార్వత్రిక ఎన్నికల వ్యవహారం వేరు. గత కొద్ది రోజులుగా వెలుగు చూస్తున్న సర్వేలు, రాష్ట్రంలో వైసీపీకి ఘోరమైన దెబ్బ తగలబోతోందనే చెబుతున్నాయి. వైసీపీ అంతర్గత సర్వేలు సైతం, 60 శాతం మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారని చెబుతున్న సంగతి తెలిసిందే.

కింద పడ్డా పై చేయి తమదేనన్నట్లుగా అధికార పక్షం వ్యవహరించడంలో వింతేముంది.? గతంలో టీడీపీ చేసింది అదే.! కానీ, వాస్తవాలు చెప్పి, పార్టీని విజయం దిశగా నడిపించలేకపోతే.. గతంలో టీడీపీకి జరిగిన పరాభవమే, వైసీపీకి కూడా జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

పొగడ్తలకు పొంగిపోకూడదు.. సానుకూల సర్వేలు చూసి జబ్బలు చరచుకోకూడదు. అన్నటికీ మించి, అనుకూల మీడియా కథనాల్ని అస్సలు నమ్మకూడదు. ఈ లాజిక్కుని వైసీపీ అధినేత విస్మరిస్తుండడమే ఆశ్చర్యకరం.