కుప్పంలో రాజకీయ రచ్చకు కారణం వైసీపీనే.. అని తెలుగుదేశం పార్టీ బాగా ప్రొజెక్ట్ చేయగలిగింది. చంద్రబాబు పర్యటనల్లో వైసీపీ జెండాలు కనిపిస్తున్నాయి.. అది కూడా నిరసన ప్రదర్శనలతో కూడిన జెండాలు. ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమంలో ఇంకో రాజకీయ పార్టీ అత్యుత్సాహం చూపడం, పైగా.. అధికార పార్టీ ఇలాంటి అరాచకాలకు పాల్పడటం క్షమార్హం కాదనేది ప్రముఖంగా వినిపిస్తోన్న వాదన.
ఇలాంటి రాజకీయాల్లో చంద్రబాబు దిట్ట. తన అను’కుల’ మీడియాతో వైసీపీని వీలైనంతగా డ్యామేజ్ చేయగలిగారు చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. ‘చంద్రబాబుకి ఇలాంటి రాజకీయాలు అలవాటే’ అనేవారు ఎక్కువమందే కనిపిస్తున్నారు. ‘అయినాగానీ, వైసీపీ చేసింది ముమ్మాటికీ తప్పే..’ అని అంతా చెబుతున్నారు.
ఈ డ్యామేజీని వైసీపీ ఇంకా గుర్తించలేకపోతోంది. ‘అబ్బే, అదంతా చంద్రబాబు కుట్ర..’ అంటూ వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. నిజానికి, ఈ ఎదురుదాడి వల్ల ప్రయోజనం లేదు. జస్ట్ సింపుల్.. పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలి.. అంటూ ఏ సజ్జల రామకృష్ణారెడ్డితోనో, ఏ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోనో ఓ ప్రకటన ఇచ్చేస్తే.. చంద్రబాబు గేమ్ ప్లాన్‌కి చెక్ పెట్టినట్లవుతుంది.
కానీ, వైసీపీ అలా చేయడంలేదు. ఇంకా ఇంకా ఈ వివాదాన్ని రాజేసేందుకే ప్రయత్నిస్తోంది. దీని వల్ల చంద్రబాబుకే రాజకీయ ప్రయోజనం ఎక్కువగా చేకూరుతోంది.
కుప్పంలో తమకు జరిగిన డ్యామేజీపై వైసీపీ నేతలే ఆఫ్ ది రికార్డుగా మాట్లాడుకుంటున్నారు. కానీ, వైసీపీ అధిష్టానం వరకూ ఆ స్థానిక పరిస్థితులు వెళ్ళవు.