వైఎస్ షర్మిల పుట్టింటి రాజకీయం.!

ఇన్నాల్లూ మెట్టినింట రాజకీయం చేసినట్టున్నారు.. ఇకపై పుట్టింట రాజకీయం చేస్తారట.! ఎవరు.? ఇంకెవరు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల రెడ్డి అలియాస్ మొరుసుపల్లి షర్మిల శాస్త్రి.!

నిన్న మొన్నటివరకూ వైఎస్ షర్మిల.. అని పిలుచుకున్న వైసీపీ ఇప్పుడామెకు మొరుసుపల్లి షర్మిలా శాస్త్రి.. అని పిలుస్తున్న సంగతి తెలిసిందే. నిజమే, వైఎస్ షర్మిల ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ కోసం సుదీర్ఘ పాదయాత్ర చేశారు. అదొక చారిత్రక సందర్భం.

వైసీపీ కోసం వైఎస్ షర్మిల పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. వైఎస్ విజయమ్మగానీ, వైఎస్ జగన్‌గానీ అంత కష్టపడి వుండరేమో.! ఓ మహిళగా, ఎన్ని సమస్యలున్నా.. అన్న కోసం వైఎస్ షర్మిల ఉమ్మడి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ప్రత్యేక పందాలో పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే.

అది గతం. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఏమయ్యిందోగానీ, అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కాదని తెలంగాణలో రాజకీయం షురూ చేశారామె. రాజకీయంగా చెల్లెల్ని వాడుకుని, అవసరం తీరాక.. ఆమెను వైఎస్ జగన్ స్వయంగా తరిమేశారన్నది ప్రధానంగా వస్తోన్న ఆరోపణ. స్వయంగా షర్మిలే ఈ ఆరోపణలు చేస్తున్నారు.

తెలంగాణలో దుకాణం సర్దేసి, వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మారిన వైఎస్ షర్మిల, తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘పుట్టింట రాజకీయం చేస్తున్నానిప్పుడు..’ అంటూ తిరుపతిలో వ్యాఖ్యానించారు వైఎస్ షర్మిల.

వైసీపీ కోసం 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే, కనీస మానవత్వం లేకుండా, కృతజ్ఞతాభావం లేకుండా తన వ్యక్తిత్వాన్ని కించపర్చే విమర్శలు వైసీపీ నేతలు చేస్తున్నారని వాపోయారు షర్మిల. రాజకీయం అంటేనే అంత.! రాజకీయ నాయకురాలిగా కేసీయార్ మీదా, కేటీయార్ మీదా.. గతంలో షర్మిల చేసిన వ్యక్తిగత విమర్శల సంగతేంటి.?