జెండా పీకేద్దామా.! పునరాలోచనలో పడ్డ వైఎస్ షర్మిల.!

వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో తెలంగాణలో గత కొద్ది రోజులుగా రాజకీయాలు చేస్తున్నారు వైఎస్ షర్మిల. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా తనకున్న ‘కాస్త గుర్తింపు’ తనను రాజకీయంగా నిలబెడుతుందని ఆమె ఆశించారు. సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి తనకు రాజకీయంగా మద్దతు లభిస్తుందని కూడా షర్మిల అనుకున్నారు.

అయితే, ‘మేమే తెలంగాణలో పార్టీని వద్దనుకున్నాం. షర్మిల తెలంగాణలో పార్టీ పెడతామంటే వద్దన్నాం. కానీ, ఆమె వినలేదు..’ అంటూ కొన్నాళ్ళ క్రితం వైసీపీ ముఖ్య నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించిన విషయం విదితమే.

ఎవరేమనుకున్నా డోన్ట్ కేర్.. అన్న చందాన షర్మిల తెలంగాణలో రాజకీయం చేసుకుంటూ వెళుతున్నారు. సుదీర్ఘ పాదయాత్రకూ శ్రీకారం చుట్టారు. తన పాదయాత్రకు జనాన్ని పోగెయ్యడం కనా కష్టంగా మారినా, దొరికే ఆ కొద్ది మందితో ‘మమ’ అనిపించేస్తున్నారామె. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ మీదా, ఆయన తనయుడు కేటీయార్ పైనా షర్మిల సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి ఆమెను పట్టించుకోవడంలేదు.
‘ఇలా ఇంకెన్నాళ్ళు.?’ అన్న చర్చ షర్మిల సన్నిహితుల్లో జరుగుతోందట. ‘జెండా పీకెయ్యడమే మంచిది..’ అన్న భావనకు షర్మిల వచ్చేశారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ‘అదే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం చేస్తే కాస్తయినా పనికొచ్చేది..’ అని షర్మిలకి ఆమె భర్త అనిల్ కూడా సూచిస్తున్నట్లు తెలుస్తోంది.

కానీ, ఏపీ రాజకీయాల్లో అన్న వైఎస్ జగన్ నుంచి వచ్చే పోటీని షర్మిల తట్టుకోలేరు. అలాగని వైసీపీలో కూడా ఆమె చేరలేరు. ఒకవేళ ఏపీలో షర్మిల గనుక పార్టీ పెడితే, ఖచ్చితంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ కంటే బెటర్‌గా ఆమె పరిస్థితి ఏపీలో వుండొచ్చు.