15 నెలల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన దాదాపు వివాదాల చుట్టూ తిరుగుతూనే ఉంది. ఇప్పటికే కోర్ట్ ల దగ్గర అవమాన పడుతూ , పక్క రాష్ట్రల దగ్గర పరువు పోగొట్టుకుంటుంది. నవరత్నాలను మ్యానిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు మెల్లమెల్లగా ఆ నవరత్నాలను గంగలో కలుపుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో ఇప్పటికే ప్రభుత్వానికి హై కోర్ట్ నుండి వ్యతిరేకత కూడా వచ్చింది. ప్రజల నుండి ఒకరకమైన వ్యతిరేకత వచ్చింది. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ మీటర్లను బిగించడం అనే నిర్ణయంపై ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.
ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న పాలన మళ్ళీ అందిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు రాజన్నకు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ అభిమానులు కూడా అంటున్నారు.
గతంలో 2004లో రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించి అధికారంలోకి వచ్చారు. రైతులకు అండగా ఉంటానని చెప్పిన రాజన్న గతంలో ఆ మాటను నిజం చేసి చూపించి రైతులకు మరింత చేరువ అయ్యారు. ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఉచిత విద్యుత్‌కు బదులుగా.. ఎంత కరెంట్ వినియోగిస్తే అంత డబ్బులిస్తామంటున్నారు. వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగిస్తామంటున్నారు. డబ్బులు ప్రభుత్వమే ఇచ్చే దానికి మళ్ళీ మీటర్స్ బిగించడం ఎందుకని రైతులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో డబ్బులు వేయకపోతే బ్యాంకుల నుండి రైతులకు ఇబ్బందులు ఎదురు అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం అమలులో అనేక ఇబ్బందులు వస్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజన్న పాలన అందిస్తానని అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే రాజన్న ఆశయాలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తుంగలో తొక్కుతున్నారని వైఎస్సార్ అభిమానులు కూడా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వైఎస్సార్ అభిమానుల ఆగ్రహాన్ని తగ్గించడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏమి చేస్తారో వేచి చూడాలి.