పవన్ కు చెక్… వైఎస్ జగన్ కీలక నిర్ణయం!

ఎన్నికల ఏడాదిలోకి అడుగుపెట్టిన వేళ ఏపీలో రాజకీయాలు మొదటిరోజునుంచే రసవత్తరంగా మారుతున్నాయి. ఈ దఫా ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని.. అలాకనిపక్షంలో తమ మనుగడే ప్రశ్నార్ధకం అయ్యే ప్రమాదం ఉందని టీడీపీ – జనసేన కూటమి బలంగా నమ్ముతుందనే కామెంట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరోపక్క ఈ దఫా కాపు సామాజికవర్గ ఓట్లు తమను కాపాడతాయని టీడీపీ కూడా బలంగా నమ్ముతుందని చెబుతున్నారు.

ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లు వైసీపీకి గంపగుత్తగా పడతాయనే చర్చ ఏపీరాజకీయాల్లో వినిపిస్తుంది. ఇదే సమయంలో బీసీల ఓట్లలో కూడా మెజారిటీ షేర్ మహిళా ఓట్ల రూపంలో జగన్ కు దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో… ఈసారి టీడీపీని గట్టెక్కించేది కాపుల ఓట్లు అనేది బలంగా వినిపిస్తున్నమాట. ప్రధానంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఈమాట బలంగా వినిపిస్తుంది.

ఇందులో భాగంగానే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలే లక్ష్యంగా అన్నట్లుగా పవన్ పూర్తి కాన్ సంట్రేషన్ ఇక్కడే పెట్టారని.. ప్రధానంగా ఉమ్మడి ఉభగదోవారి జిల్లాల్లోనే మెజారిటీ స్థానాల్లో జనసేన అభ్యర్థులను బరిలోకి దింపాలని భావిస్తున్నారు. ఈ సమయంలో చంద్రబాబుకూడా అందుకు అడ్డుచెప్పే పరిస్థితి లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో సరైన సమయం చూసి జగన్.. పవన్ కు చెక్ పెట్టారని అంటున్నారు పరిశీలకులు.

వాస్తవానికి పవన్ ను కాపు సామాజికవర్గం ఒకప్పుడు చాలా బలంగా నమ్మింది! వారాహియాత్ర సమయంలో మరింత ఎక్కువగా అతనిపై ఆశలు పెట్టుకుంది. అయితే… అదే వారాహి యాత్ర పూర్తయ్యే లోపు ఆ ఆశలు, నమ్మకాలకు బీటలు వారడం మొదలైంది! ఇక రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా పవన్ చేసిన వ్యాఖ్యలు.. ఇటీవల సీఎం పదవి విషయంలో లోకేష్ చేసిన వ్యాఖ్యలు… కాపుల్లో ఒకరకమైన నైరాశ్యాన్ని పెంచాయని అంటున్నారు.

దీంతో… పవన్ కోసం ఎంతదూరమైనా వెళ్లే జనసైనికులు సైతం ఇప్పుడు రాజకీయాల విషయంలో కాస్త దూరం జరిగారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దూరాన్ని మరింత పెంచడానికి.. కాపు ఓట్లను వీలైనంతగా తమవైపు తిప్పుకోవడానికి అన్నట్లుగా ముద్రగడను రంగంలోకి దింపుతున్నారు జగన్! ఇందులో భాగంగా ఆ కుటుంబానికి భారీ హామీతో పాటు రెండు టిక్కెట్లు ఇవ్వబోతున్నారని అంటున్నారు.

ఇందులో భాగంగా ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే టిక్కెట్లు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో ముద్రగడ కుటుంబానికి జగన్ ఆఫర్ చేశారని.. ఆ ఆఫర్ కు ముద్రగడ సానుకూలంగా స్పందించారని అంటున్నారు. దీంతో… గోదావరి జిల్లా రాజకీయాల్లో పవన్ పూర్తిగా ఆశలుపెట్టుకున్న కాపు ఓటు బ్యాంకులో భారీ చీలక కన్ ఫాం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పైగా… చంద్రబాబు వద్ద కాపు జాతిని తాకట్టుపెట్టే పనిలో పవన్ బిజీగా ఉన్నారనే సంకేతాలు ఆ సామాజిక ఓటర్లలోకి బలంగా పంపుతున్నారని అంటున్నారు.

దీంతో ముద్రగడ పూర్తిస్థాయిలో రెండు గోదావరి జిల్లాల్లోనూ తనకున్న అనుభవాన్ని, అనుచరులను, అభిమానులను సక్రమంగా వినియోగించుకోగలిగితే… కాపు సామాజికవర్గ ఓట్ల విషయలో టీడీపీ – జనసేనలకు.. వైసీపీ భారీగా గండికొట్టినట్లే అని అంటున్నారు రాజకీయ పరిశీలకులు! మరి పవన్ – చంద్రబాబు… ఈ ఎత్తుగడ నుంచి ఎలా సేవ్ అవుతారనేది వేచి చూడాలి!