వైఎస్ జగన్ పంచాయతీ ఎన్నికల విషయంలో చాలా పట్టుదలగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పైచేయి తమదే కావాలంటున్నారు. వద్దు వద్దు అంటున్నా వచ్చిన పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటకపోతే పరువు నిలవదని భావించిన జగన్ ఆ బాధ్యతను మంత్రుల మీద పెట్టేశారు. జగన్ మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసేటప్పుడే పెర్ఫార్మెన్స్ మీదనే పదవుల కొనసాగింపు ఆధారపడి ఉంటుందని చెప్పారు. అంటే ఈ రెండున్నరేళ్లలో ఎవరు పనైతే సంతృప్తికరంగా ఉండదో వారి స్థానంలో వేరొకరు నెక్స్ట్ రెండున్నరేళ్లు మంత్రులుగా ఉంటారన్నామాట. జగన్ పెట్టిన ఈ కండిషన్ బాగానే పనిచేసింది. మంత్రులు కొందరు టచ్ చేయలేని రీతిలో తయారయ్యారు. ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి ముందు పనితనం నిరూపించుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు.
ఈ ఘట్టం ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. ఇన్ని నెలలు చేసిన కష్టం ఒక ఎత్తయితే ఈ పంచాయతీ ఎన్నికలకు చేయాల్సిన కష్టం ఇంకొక ఎత్తు. గతంలో ఎవరి మీద ఫీడ్ బ్యాక్ ఎలా ఉన్నా ఈ ఎన్నికల్లో ఫలితాలే వారి భవిష్యత్తును డిసైడ్ చేయనున్నాయి. సీఎం 90 శాతం గెలవాలని టార్గెట్ పెట్టారట. ఎంత అధికార పార్టీ అయినా 90 శాతం గెలుపు అంటే చాలా కష్టం. పైగా ప్రతిపక్షం టీడీపీకి క్షేత్రస్థాయిలో మంచి బలం ఉంది. సంస్థాగతంగా బలమైన మూలలను కలిగి ఉంది. అలాంటి పార్టీని పూర్తి స్థాయిలో అధిగమించడం అంటే అంత ఈజీ కాదు.
కానీ చేయాలి. ఇదే జగన్ ఇచ్చిన టార్గెట్. ఈ టార్గెట్ గనుక తప్పితే పాత మంత్రుల స్థానే కొత్తవారికి అవకాశం ఇస్తారట. పక్కాగా అందిన ఈ ఆదేశాలతో మంత్రులకు కంటి మీద కునుకు కరువైంది. తమ పరిధిలో అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, ప్రత్యర్ధులను నిలువరించండం ప్రధానంగా ఏకగ్రీవాలను చేసుకురావడం గురించి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే పార్టీలోనే తయారవుతున్న రెబల్స్ బెడద కొత్త తలనొప్పిగా మారిందట. ఒక్కొక స్థానానికి ఐదారు మంది కొన్నిచోట్ల 10 మంది వరకు పోటీపడుతున్నారు. దీంతో టీడీపీ మద్దతుదారుల సంగతి పక్కనపెట్టి సొంతవారిని నిలువరించడం కష్టంగా మారి సతమతమవుతున్నారట. మొత్తం మీద పంచాయతీ ఎన్నికలు మంత్రులకు పెద్ద ఫిట్టింగ్ అయ్యాయి.