వైఎస్ జగన్ నమ్మినవాళ్ల కోసం ఎంతదూరమైనా వెళతారు. అది ఆయనకున్న ఉత్తమ లక్షణం. ఆ లక్షణమే నేతలను ఆయనవైపు ఆకర్షితులయ్యేలా చేస్తోంది. 2014 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాతో సరిపెట్టుకున్నా, 23 మంది ఎమెమ్మెల్యేలు పార్టీ పిరాయించినా కొందరు నేతలు మాత్రం జగన్ వెంటే ఉన్నారు. ఎప్పటికైనా జగన్ సీమే అవుతాడని నమ్మినవాళ్ళే వాళ్లంతా. అందుకే జగన్ గత్ ఎన్నికల్లో వాళ్లందరికీ పెద్ద పీఠ వేశారు. కోరిన చోట టికెట్ ఇచ్చి ప్రోత్సహించారు. గెలిచాక పదవులు కట్టబెట్టారు. కొందరికి మంత్రి వర్గంలో చోటు కల్పిస్తే ఇంకొందరిని ఎమ్మెల్సీలను చేశారు. ఇంకొందరికి కీలకమైన నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు. అలా నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూశారు.
ఇక టీడీపీని వీడి వైసీపీలో చేరతామన్న ఎమ్మెల్యేలను రాజీనామా షరతు పెట్టారు ఆయన. దీంతో వెనక్కు తగ్గిన టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు తమవారిని వైసీపీలో చేర్చి అనధికారికంగా ఆ పార్టీకి దగ్గరయ్యారు. అంతేకానీ ఎవ్వరూ రాజీనామాలు చేయలేదు. కానీ ఎమ్మెల్సీ పోతుల సునీత మాత్రం రాజీనామా చేసి వైసీపీలోకి వెళుతున్నారు. టీడీపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. చంద్రబాబు నాయుడు కోర్టులను అడ్డంపెట్టుకుని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజల ప్రయోజనాలను నీరుగారుస్తున్నారని మండిపడిన ఆమె అందుకు నిరసనగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కొనసాగిస్తున్న పాలనకు మద్దతుగా ఉంటానని ప్రకటించారు.
2014లో చీరాల నుండి పోటీచేసిన సునీత ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో గెలిచిన ఆమంచి వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో ఆమెను ఎమ్మెల్సీని చేశారు చంద్రబాబు. 2019 ఎన్నికలకు ముందు ఆమంచి తిరిగి వైసీపీలోకి వెళ్లిపోయారు. అయినా సునీత టీడీపీలోనే ఉన్నారు. ఇటీవలే ధిక్కార స్వరం వినిపించి అనర్హత వేటుకు గురయ్యే ప్రమాదం తెచ్చుకున్నారు. అయితే ఇంతలోపే రాజీనామా సమర్పించి సంచలనం సృష్టించారు. తాజాగా మండలి ఛైర్మన్ ఆమె రాజీనామాను ఆమోదించారు. 2023 వరకు పదవీ కాలం ఉండగా ఆమె రాజీనామా చేయడం ఒకింత ఆశ్చర్యకరమైన అంశమే. తనను నమ్మి పదవికి రాజీనామా చేశారు కాబట్టి ఆ స్థానాన్నితిరిగి ఆమెకే కేటాయించనున్నారు జగన్. అంటే సునీత అధికారికంగా వైసీపీ నేతగా మారడమే కాకుండా వదులుకున్న పదవిని తిరిగి పొందనున్నారు. ఎలాగూ వైసీపీ బలంగా ఉంది కాబట్టి ఆమె ఎన్నిక లాంఛనమే కానుంది.