వైఎస్ జగన్ తెలుగు తప్పులపై టీడీపీ అను’కుల’ మీడియా అతి.!

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఎవరు అధికారంలో వున్నా, అధికారిక ప్రసంగం ఇలాంటి కార్యక్రమాల్లో మామూలే. చెయ్యలేనివి కూడా చేసేస్తామని చెప్పడం ఎన్నో ఏళ్ళుగా నడుస్తున్న వ్యవహారమే.

ముందుగానే స్క్రిప్ట్ తయారవుతుంది.. ఆ స్క్రిప్టుని చదివేస్తుంటారు.. ముఖ్యమంత్రి కావొచ్చు, ప్రధాన మంత్రి కావొచ్చు. కాస్త గుర్తు పెట్టుకోగలిగితే, స్క్రిప్టు చూడకుండానే ప్రసంగించేస్తుంటారు. స్క్రిప్టు చూసినా, చూడకున్నా తప్పులు దొర్లడం అనేది సర్వసాధారణమే.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఈ మధ్యకాలంలో తెలుగుతో బాగా ఇబ్బంది పడుతున్నారు. అందుకేనేమో, తెలుగు మీడియంని పాతరేసి.. ఓన్లీ ఇంగ్లీషు మీడియం అంటున్నారాయన. సరే, అది కేవలం రాజకీయ విమర్శ మాత్రమే.. అంటే, అది వేరే వ్యవహారం.

ముఖ్యమంత్రి ప్రసంగంలో తప్పుల్ని లెక్కబెట్టింది టీడీపీ అను’కుల’ మీడియా తాజాగా. దాదాపు నలభై ఐదు నిమిషాల ప్రసంగంలో పదిహేనుకి పైగా తప్పులు దొర్లాయన్నది సదరు మీడియా ఉవాచ. నిజమే కావొచ్చు, తప్పులు అంతకన్నా ఎక్కువే వుండొచ్చు. మిన్ను విరిగి ఏమైనా కింద పడిపోతుందా ఆ తప్పులతో.?

అన్నట్టు, సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో వైఎస్ జగన్ నోట ఎలాంటి తప్పులూ దొర్లలేదు. పైగా, ఆ ప్రసంగాలేవీ వైఎస్ జగన్ చూసి చదవలేదు. కానీ, ఇప్పుడెందుకో వైఎస్ జగన్ ప్రసంగాల విషయంలో ఇబ్బంది పడుతున్నారు. బహుశా, తప్పుల్ని వెతుకుతున్నారన్న చిన్నపాటి భయంతో కావొచ్చు.

ఇదిలా వుంటే, నారా లోకేష్ తప్పుల్ని వైసీపీ ఎత్తి చూపిస్తోంది కాబట్టి, దాంతో ఒళ్ళు మండిన టీడీపీ అను’కుల’ మీడియా, ముఖ్యమంత్రి తప్పుల్ని ఎత్తి చూపుతోందన్నమాట. ప్రతిపక్షం విఫలమైన దరిమిలా, టీడీపీ అను’కుల’ మీడియా ఆ పాత్ర ఘనంగా పోషించాలనుకుంటున్నట్టుంది.