వైఎస్ జగన్ గత ఎన్నికల్లో 151 స్థానాల అఖండ మెజారిటీతో విజయం సాధించినా కొన్ని నిరాశలు మాత్రం తప్పలేదు. ఆయన ఖచ్చితంగా గెలిచి తీరాలని అనుకున్న కొన్ని నియోజకవర్గాల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అలాంటి నియోజకవర్గాల్లో రాజమండ్రి సిటీ ఒకటి. రాజమండ్రికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరుంది. తూర్పు గోదావరి జిల్లా రాజకీయాల్లో రాజమండ్రి సిటీకి ప్రముఖ స్థానం ఉంది. ఆ నియోజకవర్గం మీద పట్టు సాధించడానికి అన్ని పార్టీలు విశేషంగా కృషి చేస్తుంటాయి. అలాంటి చోట వైసీపీని పాతుకుపోయేలా చేయాలని వైఎస్ జగన్ బలంగా అనుకున్నారు. కానీ ఆయన ఆశలు తీరడం లేదు. 2014 ఎన్నికల నుండి వరుస ఓటములు వైసీపీని వెంటాడుతూనే ఉన్నాయి. జగన్ ఎలాంటి ఎత్తుగడ వేసినా అది బెడిసికొడుతూనే ఉంది.
2014 ఎన్నికలకు చాలా ముందే సిట్టింగ్ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు కాంగ్రెస్ పార్టీ నుండి వైసీపీలోకి వచ్చారు. 2004, 2009లో వరుసగా సూర్యప్రకాశరావు ఎమ్మెల్యేగా గెలిచారు. అందుకే ఆయన్ను 2014 ఎన్నికల్లో కూడ వైసీపీ నుండి ఎమ్మెల్యేగా నిలపాలని అనుకున్నారు. కానీ సూర్యప్రకాశరావు మాత్రం అందుకు అంగీకరించలేదు. ఎమ్మెల్యేగా బరిలో దిగకుండా పార్టీ పనులు చూసుకున్నారు. దీంతో జగన్ ఇక చేసేది లేక ప్రముఖ వ్యాపారి బొమ్మన రాజ్ కుమార్ ను నిలబెట్టారు. కానీ ఆయన ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి ఆకుల సత్యనారాయణ గెలుపొందారు. దీంతో నిరుత్సాహం చెందిన జగన్ 2019 ఎన్నికల్లో అలా జరగకూడదని భావించి రౌతు సూర్యప్రకాశరావును ఎన్నికల్లో నిలిపారు.
దీంతో వైసీపీ విజయం ఖాయమని అనుకున్నారు అందరూ. కానీ గ్రౌండ్ లెవల్ రియాలిటీ వేరుగా ఉంది. టీడీపీ అభ్యర్థి, కింజరపు కుటుంబానికి చెందిన ఆదిరెడ్డి భవానీ గెలుపొందారు. అది కూడ సుమారు 30 వేల మెజారిటీతో గెలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వైసీపీ శ్రేణులైతే షాక్ తిన్నాయి. సూర్యప్రకాశరావు 2014 ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో అయనకు క్యాడర్ పూర్తిగా దూరమయ్యారు. అందుకే ఓటమి తప్పలేదు. ఈ వాస్తవాన్ని జగన్ ఎన్నికల ఓటమి తర్వాతే గ్రహించగలిగారు. ఓటమి తర్వాత సూర్యప్రకాశరావు పార్టీ పనులకి దూరంగా ఉంటూ వచ్చారు. దీంతో విషయం అర్థమైన జగన్ దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. నియోజకవర్గ ఇన్ ఛార్జుగా శిఖాకొల్లు శివరామ సుబ్రమణ్యంను నియమించారు. మరి ఈసారైనా రాజమండ్రి సిటీ మీద పట్టు సాధించాలనే జగన్ కోరిక తీరుతుందేమో చూడాలి.