జగన్ సారూ.! ఆరోపణలెందుకు.? అరెస్టు చేయించొచ్చు కదా.?

‘ఇరుకు సందుల్లో మీటింగులు పెట్టి, జనాన్ని బలి తీసుకున్నారు..’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇటీవల కందుకూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నిర్వహించిన ఓ బహిరంగ సభ కారణంగా 8 మంది ప్రాణాలు కోల్పోయిన మాట వాస్తవం.

చంద్రబాబు సభ కోసం భారీగా జనాన్ని తరలించాయి స్థానిక టీడీపీ శ్రేణులు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఇరుకు ప్రాంతం.. పైగా ఓ కాలువ ప్రమాదకరమైన స్థితిలో వుండడం.. వెరసి, ఈ దుర్ఘటనకు కారణం. ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఈ ఘటనపై స్పందించారు.. బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వమూ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. టీడీపీ అయితే ఏకంగా 25 లక్షల వరకు ఒక్కో మృతుడి కుటుంబానికీ ప్రకటించింది.

ఈ ఘటన విషయంలో టీడీపీ శ్రేణుల అత్యుత్సాహాన్ని ప్రశ్నించి తీరాల్సిందే. కానీ, ముఖ్యమంత్రి పదవిలో వున్న వ్యక్తి ఆరోపణలు చేస్తే సరిపోతుందా.? ‘తొక్కిసలాటకు కారణం ఇరుకు సందుల్లో సభ పెట్టడం.. ఎక్కువమంది వచ్చారని చూపించుకునేందుకే అలా చేశారు.. 8 మందిని బలి తీసుకున్నారు..’ అంటూ తాజాగా వైఎస్ జగన్ ఆరోపించారు.

నిజానికి, కేవలం ఆరోపణలు చేస్తే, అది ముఖ్యమంత్రికి గౌరవం అనిపించుకోదు. చంద్రబాబే కారకుడని ముఖ్యమంత్రి చెబుతున్నారు గనుక, నేరుగా హత్య కేసులే చంద్రబాబుపై పెట్టించగలగాలి.

నిజానికి, ఇది కేవలం చంద్రబాబుకి సంబంధించిన అంశం కాదు. ఓ పార్టీకే పరిమితమైన అంశం కాదు. ఏ పార్టీ ఈ తరహా సభలు నిర్వహించినా, అక్కడ ప్రాణ నస్టం జరిగితే.. హత్య కేసులు నిర్వాహకులపై పెట్టి తీరాలేమో.. అది అధికార పార్టీకి కూడా వర్తిస్తుంది. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకీ వర్తించేలా పోలీసు వ్యవస్థ వ్యవహరించగలగాలి.