తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇంకొన్నేళ్ళపాటు గుర్తుండిపోయేలా దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఒడిసిపట్టుకుంది. కనీసం రన్నరప్ కూడ కాలేదని అనుకున్న ఆ పార్టీ ఏకంగా విన్నర్ అయి కూర్చుంది. ఇక్కడ బీజేపీ ఎలా గెలిచింది అనే పాయింట్ కంటే కేసీఆర్ ఎందుకు ఓడిపోయారు అనే ఆలోచనే అందరి మెదళ్ళనూ తొలిచేస్తోంది. ఇందుకు నిపుణులు చెబుతున్న ఒకే ఒక్క సమాధానం అభివృద్ధిని విస్మరించడమే. అవును.. ఇప్పటి వరకు ఆరున్నరేళ్ళకు పైగా పాలన చేసిన కేసీఆర్ దుబ్బాకకు ఒనగూర్చింది ఏమీ లేదని అక్కడి ప్రజలు భావించారు. పింఛన్, రైతులకు పెట్టుబడి సహాయం, రైతుల మోటార్లకు మీటర్లు బిగించమనే హామీ ఇవన్నీ అభివృద్ధి లేదనే భావన ముందు తేలిపోయాయి.
స్వయాన హరీష్ రావే దుబ్బాక అభివృద్ధి ముందుంది అనడంతో ఇప్పటి వరకు అభివృద్ధి జరగలేదని పరోక్షంగా అన్నట్టే అయింది. నిరుద్యోగ యువతలో అసహనం, పంట భూములకు నీరందే శాశ్వత పరిష్కారం, ఇతరత్రా మౌలిక సదుపాయాలేవీ తెరాస ప్రభుత్వం కల్పించలేకపోయింది. దుబ్బాకను ఆనుకుని ఉన్న సిద్ధిపేట, గజ్వేల్, సిరిసిల్ల అభివృద్ధి పథంలో దూసుకుపోవడం చూసిన ఓటర్లు మరి దుబ్బాక ఎందుకిలా మిగిలిపోయింది, అంటే చేయగల అవకాశం ఉండి కూడ కేసీఆర్ సర్కార్ చేయలేదు అనే తీర్మానానికి వచ్చేసి వ్యతిరేక తీర్పునిచ్చారు. అంటే ఎన్ని సంక్షేమ పథకాలు అమలుచేసినా అభివృద్ధి అనేది కనిపించకపోతే ప్రజలు తిప్పికొడతారని అర్థమైంది.
అయితే ఈ సంగతిని గమనించుకోవాల్సింది ఏపీ సీఎం వైఎస్ జగన్. ఎందుకంటే కేవలం సంక్షేమం పునాదుల మీదే ప్రభుత్వాన్ని నిర్మించుకుంటున్నారు ఆయన. మెజారిటీ నిధులను అనేక సంక్షేమ పథకాలకు మళ్లిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. లబ్ది పొందుతున్న జనం సైతం జగన్ పాలనకు జైకోడుతున్న. ఆ జేజేలు వింటూ ఇంకాస్త ఎక్కువగా సంక్షేమం చేస్తున్నారు. దీంతో రాష్ట్రం అభివృద్ధి పరంగా చాలా వెనుకబడిపోయింది. కొత్త సర్కార్ ఏర్పడి సంవత్సరం కావొస్తున్నా చెప్పుకొదగిన అభివృద్ధి కార్యక్రమాలేవీ జరగలేదు. ఇప్పుడిప్పుడే ఏవో కొద్దిగా పెట్టుబడులు వస్తున్నాయి. కనుక సంక్షేమం మీద పెడుతున్న శ్రద్ధతో కాసింత అభివృద్ధి మీద కూడ పెడితే సమతుల్యత సాధ్యమవుతుంది. అలా కాదని ఓన్లీ స్కీమ్స్ అంటూ పోతే సీన్ మారిపోతుంది.