ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అధికారం కొత్త కాదు, ప్రతిపక్షమూ కొత్త కాదు. ఎన్నేళ్లు అధికారం చేశారో అన్నేళ్లూ ముఖ్యమంత్రి పీఠానికి దూరంగానే ఉన్నారు. ఆయన అనుభవం చాలా గట్టిది. ఇప్పుడంటే ఆయన లెక్కలు తప్పాయి కానీ గతంలో ఎప్పుడూ తప్పలేదు. భవిష్యత్తులో తప్పుతాయని ఖచ్చితంగా చెప్పలేం. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలి, జగన్ బలహీనతలు ఏంటి అనే లెక్కలు వేసుకుంటున్న చంద్రబాబుకు ఏ అంశాల మీద ముందుకు వెళ్ళాలో ఒక స్పష్టత వచ్చేసింది. గత ఏడాదిన్నర కాలంగా వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు తప్ప అభివృద్ధి అనేది చేయలేదు. దాన్నే ఎక్కువగా ఎలివేట్ చేయాలనేది బాబుగారి ఎజెండా.
ఒక సెక్షన్ ఓటర్లు సంక్షేమాన్నే చూసినా అభివృద్ధిని లెక్కలు గట్టి ఓట్లు వేసే సెక్షన్ ఇంకొకటి ఉంది. వీరంతా ప్రభుత్వం ఇచ్చే అభివృద్ధి పథకాలను అందుకోలేరు. అందుకే అభివృద్ధిని చూస్తారు. ఐదేళ్ళలో ఎంత పంచారన్నది కాదు వీరికి ముఖ్యం ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టులు, ఉద్యోగావకాశాలు ఇవే వారికి కావాల్సింది. కానీ ఇవేవీ జగన్ సర్కార్ చేయలేదు. ఉన్నపళంగా ఏం అభివృద్ధి చేశారు అంటే ఠక్కున సమాధానం చెప్పలేరు వైసీపీ నేతలు. దీన్నే ఆయుధంగా మలుచుకోవాలని, ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నారు. ఎలాగూ మూడు రాజధానులకు కోర్టుల ద్వారా బ్రేకులు వేసేశారు. ఇంకో ఏడాది కూడా ఇలాగే సర్కార్ కాళ్ళకి బంధాలు వేసుకుంటూ పోవాలని చూస్తున్నారు.
కర్నూలులో హైకోర్టు నిర్మాణం మీద కూడా ఇప్పటికీ క్లాలారిటీ లేదు. దాన్ని సీమలో వాడుకోవాలనుకుంటోంది టీడీపీ. ఈలోపు కాలం కలిసొస్తే జమిలి ఎన్నికలు వచ్చేస్తే పని ఇంకా సులభమవుతుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అభివృద్ధి విషయంలో జగన్ సర్కారును సున్నాలా నిలబెట్టాలనుకుంటున్నారు. ఇక అమరావతి సెంటిమెంట్ కాస్తో కూస్తో పనిచేసే అవకాశం ఉంది. అందుకే జగన్ త్వరపడి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైనా చేస్తేనే రేపు ఎన్నికల్లో చంద్రబాబును ఎదుర్కోవడం సులభమవుతుంది. లేకపోతే ఆయన చేతుల్లో చిక్కుబడిపోవాల్సిందే. కేవలం సంక్షేమం ఒక్కటే చేసి మరోసారి అధికారంలోకి రావడమంటే కష్టం.