Minister Nara Lokesh: పులివెందుల ఎమ్మెల్యే.. ప్రతిపక్షహోదా లేని ప్రతిపక్ష నాయకుడు.. మళ్లీ అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదు.. ఈసారి పులివెందుల సీటు కూడా టీడీపీదే.. ఇంతకాలం జగన్ గురించి కూటమి నేతల నుంచి వినిపించిన మాటలు ఇవి. అయితే తాజాగా లెక్కలు మారినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా… వైఎస్ జగన్ తాము చేస్తున్న అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ ప్రభుత్వ పెద్దలు గగ్గోలు పెడుతున్నారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 175 మంది ఎమ్మెల్యేల్లో ఒకరైన జగన్.. 164 మంది ఎమ్మెల్యేలతో అత్యంత బలంగా ఉన్న కూటమి పార్టీని ప్రభావితం చేస్తున్నారా..?
ఆఫ్ట్రాల్ పులువెందుల ఎమ్మెల్యే అయిన జగన్.. కూటమి పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు అమలవ్వకుండా, వారి ఆటలు సాగకుండా కనుసైగతో అడ్డుకుంటున్నారా..?
కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండి, ప్రతిపక్ష హోదా కూడా లేని ప్రతిపక్ష పార్టీ అధినేత.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు పారిశ్రామిక వేత్తలు రాకుండా ఒక్క స్టేట్ మెంట్ తో అడ్డుకున్నారా..?
అంటే… 164 మంది ఎమ్మెల్యేలతో అత్యంత బలంగా ఉన్న అధికార పక్షం.. 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న పార్టీ అధినేతకు, ఆఫ్ట్రాల్ పులివెందుల ఎమ్మెల్యేకు ఇంతలా భయపడుతున్నారా..?

ఏపీలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను పీపీపీ పేరు చెప్పి ప్రైవేటుపరం చేస్తున్న నేపథ్యంలో.. జగన్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు దక్కించుకోవడానికి ఎవరూ ముందుకు రావొద్దని.. టెండర్లలో ఎవరూ పాల్గొనదొద్దని హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా తీసుకున్నా, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని అన్నారు.
ఇదే సమయంలో… పీపీపీ ఓ పెద్ద స్కామ్ అని, అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోపు జైలుకు పంపుతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో… మొదటి విడతలో భాగంగా పులివెందుల తోపాటు ఆదోని, మార్కాపురం, మదనపల్లె మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు టెండర్లు పిలవగా.. ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. కర్నూలు జిల్లా ఆదోని మెడికల్ కాలేజీకి మినహా మిగిలిన మూడు కాలేజీలకు కనీసం టెండర్లు వేయడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు.
దీంతో ప్రభుత్వం ఇరకాటంలో పడిందని అంటున్నారు. ఈ సమయంలో ఏమి చేయాలో తోచని చంద్రబాబు తాజాగా వైద్యారోగ్య శాఖపై సచివాలయంలో సమీక్ష నిర్వహించి.. పీపీపీ విధానంలో వైద్య కళాశాలల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. పైగా.. ఇదంతా రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించేందుకే అని చెప్పుకొచ్చారు.
ఇప్పటికే టెండర్లకు ఇచ్చిన చివరి తేదీ కూడా ముగిసినా.. ఎవరూ రాకపోయినా.. టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని చంద్రబాబు చెప్పడాన్ని పలువురు ఆత్మవంచనగా చెబుతున్నారు! తొలి విడతలో చెప్పిన నాలుగింటిలో మూడింటికి కనీసం టెండర్లు వేయడానికి కూడా ఎవరూ ముందుకు రాకపోయినా.. మరిన్ని వరాలు ఇచ్చైనా తన పంతం నెగ్గించుకోవాలని, ప్రైవేటు పరం చేయాలని బాబు మొండిగా ముందుకు వెళ్తున్నారని అంటున్నారు!

చంద్రబాబు కష్టాలు అలా ఉంటే… దీనిపై ఆగ్రహం, ఆవేదన, ఆవేశం, ఆయాసం కలిపి అన్నట్లుగా లోకేష్ ఓ పోస్ట్ పెట్టారు. ఇందులో భాగంగా… జగన్ ప్రజాపక్షం వహించకుండా అభివృద్ధిని అడ్డుకుంటూ రాష్ట్రంలో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారని.. పీపీపీ విధానంలో వైద్య కళాశాలల నిర్మాణంతో పేదలకు మేలు జరుగుతుందని, వారికి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, మెడికల్ సీట్లు లభిస్తాయని చెప్పుకొచ్చారు.
అయితే… పీపీపీ విధానంపై జగన్ ఉద్దేశపూర్వకంగా విషం చిమ్ముతున్నారని అన్నారు. దీనిపై ఏకంగా ఓ వీడియోను తయారు చేయించి విడుదల చేశారు. పరోక్షంగా తమకు అడ్డురావొద్దు అని రిక్వస్ట్ చేసుకున్నట్లుగానే ఈ వ్యవహారం ఉందనే కామెంట్లను సొంతం చేసుకున్నారని అంటున్నారు!
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… ఆఫ్ట్రాల్ పులివెందుల ఎమ్మెల్యే.. ప్రతిపక్ష హోదా కూడా లేని ప్రతిపక్ష పార్టీ అధినేత గురించి, బలమైన కూటమి పార్టీ ఇంతలా ఎందుకు బెదురుందా అనేది హాట్ టాపిక్ గా మారిందని అంటున్నారు. చంద్రబాబు అంత సీనియర్, పవన్ కల్యాణ్ అంత పవర్ ఫుల్, మోడీ వారసుడిగా చెప్పబడుతున్న లోకేష్ లు ఇచ్చిన పిలుపు ముందు.. జగన్ ఇచ్చిన చిన్న వార్నింగ్ పవర్ ఫుల్ గా నిలబడిందా? ఏమో వారికే తెలియాలి!

