సీఎం వైఎస్ జగన్.. మూడేళ్ళ తర్వాత కూడా చెప్పుకోడానికేమీ లేదా.?

YS Jagan

సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నాం.. వాలంటీర్ వ్యవస్థ తెచ్చాం.. గ్రామ సచివాలయాలు కట్టాం.. అని చెప్పుకోవడమేనా.? లేదంటే, ఇదీ మా ల్యాండ్ మార్క్.. అంటూ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వేయగలిగిన ‘ముద్ర’ ఏమైనా వుందా.?

అధికారంలోకి వస్తూనే, వాలంటీర్లన్నారు.. ఆ వాలంటీర్ వ్యవస్థ మీద ఎప్పటికప్పుడు కుప్పలు తెప్పలుగా ఆరోపణలు వస్తూనే వున్నాయి. సంక్షేమ పథకాల విషయానికొస్తే, ‘ఎవరి జేబులోంచి తీసుకొచ్చి ఖర్చు చేస్తున్నారు.. మా పేరుతో అప్పులు చేసి మాకే పంచుతున్నారు.. పైగా వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు..’ అన్న భావన గతంలో చంద్రబాబు హయాంలోనూ ప్రజల నుంచి వ్యక్తమయ్యింది.. ఇప్పుడూ అదే పరిస్థితి కనిపిస్తోంది.

సంక్షేమం పేరుతో లక్ష కోట్ల పైన ఖర్చు చేశామని వైసీపీ సర్కారు ఘనంగా చెప్పుకుంటోంటే, ఈ పేరు చెప్పి ఎంత అప్పు మా నెత్తిన రుద్దారు.? అని జనం ప్రశ్నిస్తున్న వైనాన్ని కూడా వైసీపీ పరిగణనలోకి తీసుకోవాలి మరి.!

తాత్కాలకమో.. ఇంకొకటో.. చంద్రబాబు హయాంలో, రాజధాని అమరావతి పేరుతో కొన్ని కట్టడాలైతే నిర్మితమయ్యాయి. వాటిల్లోంచే వైఎస్ జగన్ సర్కారు పాలన చేస్తోంది కూడా. చంద్రబాబు హయాంలో నిర్మితమైన సెక్రెటేరియట్, హైకోర్టు మినహాయిస్తే.. గడచిన మూడేళ్ళలో రాజధాని పేరుతో ఒక్క అదనపు నిర్మాణమైనా ముందుకు సాగిందా.? పూర్తయ్యిందా.? ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్.

ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు.. వీటన్నిటిపైనా వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి. ముందస్తు ఎన్నికల ఊహాగానాలు వినిపిస్తున్న వేళ, రాష్ట్రానికి ఏం చేశాం.? అన్నదానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆత్మ విమర్శ చేసుకుంటే మంచిది.