వైఎస్ జగన్ పబ్లిక్ మీటింగులు వర్సెస్ పవన్ కళ్యాణ్ ట్వీట్లు.!

న్యూస్ ఛానళ్ళలో వచ్చే వార్తల్ని కావొచ్చు.. ఇతరత్రా అంశాల్ని కావొచ్చు జనం నమ్మడం మానేశారు. వెబ్ మీడియా అయినా, ఇంకో రకం మీడియా అయినా.. మీడియా అంటేనే, ‘నమ్మడానికి వీల్లేనిది’ అనే భావనకి వచ్చేశారు సాధారణ ప్రజానీకం. మరి, సోషల్ మీడియాని నమ్ముతున్నారా.? అంటే అదీ లేదు.!

జస్ట్ కంటెంట్ వైరల్ అవుతోందంతే.. రాజకీయమే కావొచ్చు, సినిమా కావొచ్చు. ఏదైనాగానీ, వైరల్ వ్యవహారమే. మరి, బహిరంగ సభల ద్వారా రాజకీయ నాయకులు గొంతు చించుకుని సాధించేదేంటి.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారిక బహిరంగ సభల్లో జనసేన అధినేత మీద ‘దత్త పుత్రుడు’ అనే విమర్శలు చేయడానికి నానా హైరానా పడాల్సి వస్తోంది. అక్కడున్న వందల మంది జనం కేరింతలు కొడతారు సహజంగానే. కొట్టకపోతే కుదరదక్కడ. టీవీ ఛానళ్ళలో చూసేవాళ్ళు జస్ట్ స్కిప్ చేసేస్తారు.

ఇక, సోషల్ మీడియాలోనో, వెబ్ మీడియాలో ఇలాంటి వార్తలు కనిపిస్తే, ఆయా పార్టీల మద్దతుదారులకే అవి పెద్దగా నచ్చని పరిస్థితి. ట్వీట్ల వ్యవహారం అలా కాదు. వైరల్ కంటెంట్ అయిపోతోంది. వందలు, వేలు, లక్షల మందికి క్షణాల్లో చేరిపోతాయివి. వాటి చుట్టూ డిస్కషన్లు.. అది మెయిన్ స్ట్రీమ్ మీడియా దాకా పాకుతోంది. రచ్చబండల వరకూ వెళుతోంది.

పవన్ కళ్యాణ్ ఓ ట్వీటు ద్వారా పెద్ద ప్రభంజనానికే కారణమవుతున్నారు. వైసీపీ ఈ విషయంలో ముందుండేది ఒకప్పుడు. ఇప్పుడెందుకో అంత సమర్థవంతంగా సోషల్ మీడియా టీమ్ పని చేయలేకపోతోంది.