వైఎస్ జగన్ ఆలోచన విధానం కొత్తగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యర్థుల చేతికి చిక్కకుండా, వీలైతే వాళ్లనే ఇబ్బందుల్లో పడేసేలా వ్యూహాలు ఆలోచిస్తున్నారు ఆయన. అందుకు ఉదాహరణే రాజధాని అంశం. ఐదేళ్లపాటు ఇదే మన రాజధాని అని రాష్ట్రం మొత్తం చెప్పుకున్న అమరావతిని కాదంటూ ట్రీ క్యాపిటల్స్ విధానాన్ని తీసుకురావడం. జగన్ తీసుకున్న ఈ స్టెప్ లో ఒకే ఒక స్ట్రయిట్ పాయింట్ ఉంది. అనుకున్నది జరిగితే తనకు మంచిపేరు రావడం. అదే అనుకున్నది సఫలం కాకపోతే సేఫ్ అవడం. అమరావతి మీద రాష్ట్ర ప్రజలకు ఎంత అనుబంధం ఉందో పసిగట్టిన జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చి ప్రతిపక్షం ఎంత గోల చేస్తున్నా వెనక్కు తగ్గట్లేదు. ఆనాడు అసెంబ్లీలో అమరావతి గురించి చెప్పిన మాటలు తప్పుతున్నానని తెలిసినా బెదరట్లేదు.
జగన్ తీసుకొచ్చిన మూడు రాజధానుల ఆలోచనతో ఆయన మెజారిటీ జనాన్ని ఆకట్టుకోగలిగారు. రాయలసీమలో హైకోర్టు, న్యాయరాజధాని అనగానే సీమ ప్రజానీకం ఉప్పొంగిపోయారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేసరికి ఉత్తరాంధ్ర జనం సంబరపడ్డారు. ఇలా ప్రధానమైన రెండు రీజియన్లను జగన్ తన నిర్ణయంతో సంతృప్తి పెట్టగలిగారు. అక్కడే ఆయన సక్సెస్ కనబడుతోంది. అందుకే 13 జిలాల్లో అటు ఇటుగా 8, 9 జిల్లాల ప్రజలు అమరావతి పోరాటంలో పాలుపంచుకోవడానికి సుముఖంగా లేరు. కానీ తెలుగుదేశం మాత్రం రాష్ట్రం మొత్తం అమరావతి వెంటే ఉందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టి మూడు రాజధానుల నినాదం మీదే జగన్ నిలబడితే చిత్తుగా ఓడిపోతారని చెబుతున్నారు.
అమరావతి కోసం తెగించి పోరాడుతున్న తమను బంపర్ మెజారిటీతో గెలిపిస్తారని పగటి కలలు కంటున్నారు.
సరే ఒకవేళ ఏదో మేజిక్ జరిగి కోర్టులు స్టే మీద స్టే ఇచ్చిన పాలన రాజధానిని తరలించడం అసాధ్యమై, హైకోర్టును కర్నూలుకు తరలించడానికి రాష్ట్రపతి అభ్యంతరం తెలిపి జగన్ అనుకున్నట్టు మూడు రాజధానులను సాకారం చేయలేకపోయారనే అనుకుందాం. అప్పుడు కూడ ఆయనకు వచ్చే నష్టం ఏమీ ఉండదు. ఇప్పటికే వైసీపీ కోర్టులను అడ్డం పెట్టుకుని చంద్రబాబు అభివృద్ధి వికేంద్రీకరణకు అడ్డుపడుతున్నారనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. రేపటి రోజున రాజధానుల విభజన జరక్కపోతే ఆ తప్పు మొత్తం బాబుగారి మీదకు సులభంగానే పడిపోతుంది. అది రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలో వైసీపీకి బాగా కలిసొస్తుంది. అదే విధంగా చంద్రబాబు నాయుడుకు పెను శాపమవుతుంది.
మరి మూడు రాజధానులు కుదిరి శాసన రాజధాని, పాలన రాజధాని, న్యాయ రాజధాని విడిబడిపోతే అది జగన్‌కు ఇంకా పెద్ద ప్లస్ అవుతుంది. అమరావతికి సపోర్ట్ చేస్తున్న గుంటూరు జిల్లా, ఆ చుట్టుపక్కల ఇంకొన్ని ప్రాంతాలు మినహా మిగతా జిల్లాలు మొత్తం జగన్ చెప్పినట్టే మూడు రాజధానులను చేసి చూపించారు. అభివృద్ధి వికేంద్రీకరణ ఖాయమని బలంగా నమ్ముతాయి. ఇక్కడ కూడ నష్టపోయేది చంద్రబాబే. ఇలా రెండు వైపుల పదునున్న మూడు రాజధానుల కత్తిని పట్టుకున్న జగన్ ఒక వైపు మిస్సైతే ఇంకో వైపుతో చంద్రబాబును డ్యామేజ్ చేయడం ఖాయం.