16:06:55ప్రతిపక్షం అంటే ప్రభుత్వం మీద నిఘా పెట్టి గాడి తప్పకుండా చూసే ఒక కాపలాదారు. చురకలు వేస్తూనే అవసరమైనప్పుడు సలహాలు, సూచనలు ఇచ్చి ఆదుకునే సలహాదారు. ఇది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు పాలక వర్గం ఏ పని చేసినా వెళ్లి కాళ్లకు అడ్డం పడిపోవాలి, అవసరం ఉన్నా లేకున్నా విమర్శలు చేయాలి, న్యాయవ్యస్థలోని వెసులుబాట్లను వాడుకుని ఇబ్బందులకు గురిచేయాలి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఇప్పుడు అదే చేస్తోంది. చంద్రబాబు నాయుడు నైజాన్ని కూలంకషంగా ఎరిగిన జగన్ ఈ ప్రమాదాన్ని ముందే ఊహించారు. అందుకే తనదైన వ్యూహాలతో రెడీగా ఉన్నారు. చంద్రబాబు ఎప్పటిలాగే జగన్ ఉచిత పట్టాలు ఇస్తానంటే ఏదో ఒక విధంగా అడ్డగించాలని చూశారు. లొసుగుల్ని పట్టుకుని తనవాళ్లతో కోర్టుల్లో కేసులు వేయించారు. ఎప్పుడో జరగాల్సిన పంపిణీని ఆలస్యమయ్యేలా చేశారు.
అయితే చంద్రబాబు నాయుడుకు అలా కేసులు వేసే వెసులుబాటు ఇచ్చింది జగనే అనాలి. జగన్ తాను పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తానంటే, ఇల్లు కట్టిస్తానంటే చంద్రబాబు రియాక్షన్ వేరేలా ఉండేది. కానీ జగన్ పట్టాలతో పాటు వాటి మీద ఆస్తి హక్కు కల్పిస్తానని అన్నారు. అక్కడే ప్రతిపక్షానికి సాకు దొరికేసింది. రాజ్యాంగం మేరకు ఉచితంగా ఇచ్చే భూములను అనుభవించడమే కానీ అమ్ముకునే హక్కును కల్పించరాదు. పైగా పంపిణీపై సేకరించిన 26 వేల ఎకరాల భూమిలో కొన్ని వేల ఎకరాలు ప్రభుత్వ అవసరాల కోసం ప్రత్యేకంగా కేటాయించబడినవి. వాటిని ముట్టుకోవడానికి వీల్లేదు. వీటిని పట్టుకుని కోర్టులో పిటిషన్లు వేశారు. వాటి మీద విచారణలు నడుస్తున్నాయి. విచారణ పూర్తయ్యాక కూడ ఆస్తి హక్కు ఇవ్వరాదని, ప్రభుత్వం కేటాయించుకున్న భూములను పంచరాదనే తీర్పు వస్తుంది.
మరి జగన్ కు ఇవన్నీ తెలియదా, ఆయనకు ఎవరూ చెప్పలేదా అంటే తెలియదని ఎలా అనుకోగలం. అన్నీ తెలిసే చేశారు. ఆ చేయడంలోనే పెద్ద ట్రాప్ ఉంది. జగన్ వచ్చి వేల ఎకరాలు పంచేస్తాను, చరిత్రలో నిలిచిపోతాను అంటే బాబుగారు ఊరుకుంటారా సామ దాన బేధ దండోపాయాలన్నీ ప్రయోగించి ఏదో రకంగా అడ్డుతలిగేవారే. అందుకే ఆయన్ను ఆస్తి హక్కు వైపుకు మళ్లించి పట్టాల పంపిణీ అనే లక్ష్యాన్ని కాపాడుకోగలిగారు. కోర్టుల్లో నడుస్తున్న కేసుల్లో రాజ్యాంగం ప్రకారం భూములు ఇస్తామంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదనే కంక్లూజన్ ఉంది. అదే జగన్ కు కావాల్సింది. ప్రతిపక్ష నేతలు కూడ అడ్డదిడ్డంగా కాదు సక్రమంగా పంపిణీ చేయండి అంటూ స్వయంగా చెప్పేశారు.
ఇక జగన్ తన ప్లాన్ ఫలించింది అనుకుంటూ ఆస్తి హక్కు లేకుండా డీ-పట్టాల ద్వారానే భూముల పంచుతామని ప్రకటించారు. డిసెంబర్ 25న ముహూర్తం ఖరారు చేశారు. ఇప్పుడిక ప్రతిపక్షం వేలు పెట్టడానికి ఏమీ లేదు. సమస్య మొత్తం ఆస్తి హక్కు కల్పన దగ్గర ఇరుక్కుపోయింది. జగన్ ఎలాగూ దాన్ని ఉపసంహరించుకున్నారు కాబట్టి ఆయన్ను పల్లెత్తి మాట అనడానికి లేదు. ఇప్పుడిక పంపిణీ కార్యక్రమం చూసి చేతులు నలుపుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ ఉండదు. ఈ ఎపిసోడ్ మొత్తాన్ని ఒక్కసారి రీప్లేలో చేసుకుంటే జగన్ తనను ఎలా తప్పుదోవ పట్టించాడో చంద్రబాబుకు 70 ఎమ్ ఎమ్ సినిమా కనబడుతుంది.