దేశంలో జమిలి ఎన్నికలకు మోదీ ప్రభుత్వం సిద్ధమయినట్లే కన్పిస్తుంది. అయితే 2022 లో జమిలి ఎన్నికలకు సంబంధించి కొన్ని రాజ్యాంగ సవరణలను చేయాల్సి ఉంది. అందుకు ఇతర పార్టీల నేతలతో సంప్రదింపులు ప్రారంభించారని తెలుస్తోంది.మోదీ ఈ బాధ్యతను అమిత్ షాకు అప్పగించారని చెబుతున్నారు. వ్యవసాయ కొత్త చట్టాలపై ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారని బయట ప్రచారం జరుగుతున్నా లోపల మాత్రం జమిలి ఎన్నికల ప్రస్తావన ఎక్కువగా ఉందని ఢిల్లీ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. జగన్ కూడా జమిలి ఎన్నికలకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
ఇటీవల జగన్ ను అమిత్ షాను కలసిన సందర్భంలో తాను జమిలి ఎన్నికలకు సిద్ధంగానే ఉన్నానని చెప్పారట. అసలు జమిలి ఎన్నికలకు వెళితే జగన్ కు ప్రయోజనమా? లేదా? అన్న దానిపై జగన్ ఢిల్లీ టూర్ తర్వాత పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. జమిలి ఎన్నికలను ఊహించే జగన్ తొలి నుంచి సంక్షేమంపై దృష్టి పెట్టారంటున్నారు వైసీపీ నేతలు. పేదలకు ఇళ్ల పట్టాల నుంచి రైతు భరోసా, అమ్మవొడి వంటి కార్యక్రమాలను మూడో విడత కూడా ఇచ్చేస్తున్నారు. సంక్షేమంతోనే జమిలి ఎన్నికలకు వెళ్లాలని జగన్ భావిస్తున్నారు.
రాష్ట్రంలో రానున్న రెండేళ్లలో ఇటు సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై కూడా దృష్టిపెట్టాలని జగన్ సీనియర్ నేతలకు సూచించారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు విశాఖలో పరిపాలన రాజధానిని కూడా ఏర్పాటు చేయాలన్నది జగన్ నిర్ణయంగా ఉంది. కేంద్రాన్ని ఒప్పించి కర్నూలులోనూ న్యాయరాజధానిని ఏర్పాటు చేస్తే జమిలి ఎన్నికల్లో తనకు తిరుగుండదని జగన్ అంచనా వేసుకుంటున్నారట. అయితే జమిలి ఎన్నికలకు జగన్ సిద్ధమవ్వడం పార్టీలో చర్చనీయాంశమైంది.