YSRCP Talks – Kurnool: ”వైఎస్ఆర్‌సీపీ టాక్స్‌ – కర్నూలు” కొత్త యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించిన వైఎస్ జగన్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్‌సీపీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై పోరాటానికి సన్నద్ధమయ్యారు. తమ ప్రభుత్వ హయాంలో స్థాపించిన ప్రభుత్వ వైద్య కళాశాలలను కూటమి ప్రభుత్వం పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) పద్ధతిలో ప్రైవేట్‌పరం చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రాంతీయ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకుల సమావేశంలో వైఎస్ జగన్ ఈ మేరకు పార్టీ కార్యాచరణను ప్రకటించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, పాలన తీరుపై చర్చించిన ఆయన, ముఖ్యంగా ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించారు.

ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలను సేకరించాలని జగన్ నిర్ణయించారు. ఈ ప్రజా ఉద్యమ కార్యాచరణలో భాగంగా ప్రతి గ్రామంలోనూ విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని ఆయన సూచించారు. వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం వల్ల కలిగే నష్టాన్ని, అలాగే ‘సూపర్ సిక్స్’, ‘సూపర్ సెవెన్’ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. దీనికి అనుబంధంగా గ్రామంలో పార్టీ గ్రామ కమిటీలు, అనుబంధ సంఘాల అధ్యక్షుల నియామకాలను పూర్తి చేయాలని కూడా ఆయన పేర్కొన్నారు.

‘వైఎస్ఆర్‌సీపీ టాక్స్‌ – కర్నూలు’ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభం:

ఈ ప్రజా ఉద్యమ సందేశాన్ని, పార్టీ కార్యకలాపాలను సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజలకు, పార్టీ శ్రేణులకు చేరవేసే లక్ష్యంతో రూపొందించిన ఒక ప్రత్యేక యూట్యూబ్ ఛానెల్‌ను వైఎస్ జగన్ ఈ సందర్భంగా లాంఛనంగా ప్రారంభించారు. ‘వైఎస్ఆర్‌సీపీ టాక్స్‌ – కర్నూలు’ పేరుతో ఏర్పాటైన ఈ యూట్యూబ్ ఛానెల్‌ను కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి రూపొందించారు.

పార్టీకి సంబంధించిన అన్ని కార్య‌క్ర‌మాలు, కూట‌మి ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎప్పటికప్పుడు తిప్పికొట్టడానికి ఈ యూట్యూబ్ ఛానెల్ ఉప‌యోగ‌క‌రంగా ఉంటుందని జగన్ పేర్కొన్నారు.

ఈ సమావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎస్‌.వి. మోహన్‌ రెడ్డి, నంద్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు కాటసాని రామ్‌భూపాల్‌ రెడ్డి, కర్నూలు నగర మేయర్‌ బి.వై.రామయ్య, కర్నూలు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి హనుమంత రెడ్డి సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

AP మొత్తం నారా వారి కల్తీ మద్యమేనా..! | Adusumalli Srinivasa Rao Somments on Jagan | Telugu Rajyam