రామాయపట్నం పోర్టుకి వైఎస్ జగన్ శంకుస్థాపన.! అంతేనా.?

Ys Jagan

రాష్ట్రంలో చాలా పోర్టులు కట్టేస్తున్నాం.. చాలా ఫిషింగ్ హార్బర్లు కట్టేస్తున్నాం.. అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రామాయపట్నం పోర్టు శంకుస్థాపన సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఈరోజు పత్రికల్లో ప్రకటనలు కూడా దర్శనమిచ్చాయి.

మంచిదే, రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోంటే కాదనేవారెవరు.? అయితే, అధికారంలోకి వచ్చిన మూడేళ్ళకు రామాయపట్నం పోర్టుకి శంకుస్థాపన జరగడమే ఒకింత ఆశ్చర్యకరం. చంద్రబాబు హయాంలోనే ఈ పోర్టుకి శంకుస్థాపన జరిగింది. ఇది ఇప్పుడు రెండోసారి అన్నమాట.

36 నెలల్లో పోర్టు తొలి దశ పనులు పూర్తయిపోతాయని వైఎస్ జగన్ సర్కారు చెబుతోంది. దాదాపు మూడేళ్ళ క్రితం ఇదే ప్రాజెక్టుకి శంకుస్థాపన జరిగింది. మూడేళ్ళ తర్వాత మళ్ళీ ఇంకోసారి శంకుస్థాపన. ఈ లెక్కన, మూడేళ్ళ తర్వాత ప్రాజెక్టు పూర్తవుతుందా.? కొత్త ప్రభుత్వం ద్వారా మరో శంకుస్థాపన తప్పదా.?

ఏమోగానీ, కడప స్టీలు ప్లాంటు, రామాయపట్నం పోర్టు.. ఇవి రాష్ట్రానికి సెంటిమెంటు పరంగా అంతలా కలిసొస్తున్నట్టు లేవు. ఆ చెత్త సెంటిమెంటు ఈసారైనా బ్రేక్ అయితే అంతకన్నా కావాల్సిందేముంది.? రాష్ట్ర అభివృద్ధిలో పోర్టులు కీలక పాత్ర పోషిస్తాయి. రాష్ట్రానికి సుదీర్ఘ తీర ప్రాంతమే వరం.

రాజకీయాల కారణంగా కేంద్రం చేపట్టాల్సిన ఈ పోర్టు వెనక్కి వెళితే, రాష్ట్ర ప్రభుత్వం ఒకింత సాహసోపేతంగా ముందడుగు వేయాల్సి వచ్చింది. చూద్దాం.. ఈసారైనా రామాయపట్నం పోర్టుకి పట్టిన రాజకీయ గ్రహణం వీడిపోతుందేమో.!