పారిశ్రామికవేత్తలకు  జగన్ ఆహ్వానం

విజయవాడలో మొదలైన డిప్లమాటిక్ ఔట్ రీచ్ అంటే పెట్టుబడుల సదస్సులో జగన్ ఏపిలో పెట్టుబడులు పెట్టాలంటూ జగన్మోహన్ రెడ్డి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. తన ప్రసంగం మొత్తంలో పెట్టుబడులు పెట్టటానికి ఏపిలో ఉన్న అవకాశాలేమిటి ? తమ ప్రభుత్వం పరిశ్రమల ప్రోత్సాహానికి ఇవ్వనున్న ప్రోత్సాహకాలేమిటి ? అనే అంశాలను చక్కగా వివరించారు.

దాదాపు పావుగంట మాత్రమే మాట్లాడిన జగన్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. 60 రోజుల క్రితం తాను అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకూ తీసుకున్న నిర్ణయాలను, చేసిన చట్టాలను పారిశ్రామికవేత్తలకు, వివిధ దేశాల రాయబారులకు వివరించారు. పరిశ్రమల ఏర్పాటులో కీలకమైన విద్యుత్ ఛార్జీల ధరల తగ్గింపుకు పిపిఏల రద్దు లాంటి నిర్ణయాలను కూడా వివరించారు.

కేంద్రం, తెలంగాణా రాష్ట్రంతో ఉన్న సత్సంబంధాల గురించి చెప్పారు. పెట్టుబడులు పెట్టటానికి ఏపిలో ఉన్న 975 కిలోమీటర్ల సముద్ర తీరం, మౌళిక సదుపాయాలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, రోడ్డు సౌకర్యాల గురించి చెప్పారు. రాబోయే నాలుగేళ్ళల్లో మరో నాలుగు పోర్టులు అందుబాటులోకి రానున్న విషయాన్ని కూడా చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన లైసెన్సులు ఇవ్వటానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇచ్చారు.

విన్ విన్ సిట్చువేషన్ లో ఏపి అభివృద్ధితో పాటు పారిశ్రామికవేత్తలకు కలగబోయే ప్రయోజనాలను కూడా క్లుప్తంగా వివరించారు. ఏపిలో పెట్టుబడులు పెట్టటం పారిశ్రామికవేత్తలకు ఏ విధంగా మేలు చేస్తుందో కూడా వివరించారు. మొత్తం మీద జగన్ పావుగంట ప్రసంగం అందరినీ ఆకట్టుకున్నదనే చెప్పాలి. సదస్సు తర్వాత కొందరు పారిశ్రామికవేత్తలు, రాయబారులు జగన్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.