భద్రాచలం రగడ: వైఎస్ జగన్ ముందున్న బెస్ట్ ఆప్షన్.!

ప్రత్యేక హోదా సంగతి తర్వాత. ఇతరత్రా అంశాల గురించీ వేరే చర్చ.! కానీ, భద్రాచలం విషయంలో ఒకింత సీరియస్‌గా ఆలోచించాల్సిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతోన్న చర్చ ఇది. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీతో వైసీపీ సఖ్యతకు అర్థం వుండాలంటే, భద్రాచలం ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కలిపేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలంటూ వైసీపీ ప్రభుత్వానికి సలహాలు, డిమాండ్లు పోటెత్తుతున్నాయి.

పోలవరం ముంపు ప్రాంతంలోని ఐదు గ్రామాలు తెలంగాణలో కలిసేందుకు తీర్మానం చేసుకోవడాన్ని సీరియస్‌గా తీసుకోవాలన్నది వైసీపీ సర్కారుపై పెరుగుతోన్న డిమాండ్. నిజమే, ఇది చాలా సీరియస్ అంశం. మంత్రులు ఏవేవో మాట్లాడేసి, తెలంగాణ రాష్ట్రంలోని అధికార పార్టీకి కౌంటర్ ఇస్తే సరిపోదు.! ఇది, రాష్ట్ర సార్వభౌమత్వానికి సంబంధించిన అంశమన్న వాదన వినిపిస్తోంది.

ఓ రాష్ట్రం, ఇంకో రాష్ట్రంలోని భూభాగంపై కన్నేయకూడదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పొరుగు రాష్ట్రం ఒరిస్సాతో సరిహద్దు వివాదాన్ని ఎదుర్కొంటోంది. ఏపీలోని గ్రామాలు తమవేనంటూ కొటియా ప్రాంతంలో ఒరిస్సా చేస్తున్న యాగీ గురించి తరచూ వింటున్నాం. ఇప్పుడు కొత్తగా పోలవరం ముంపు ప్రాంతంలోని ఐదు గ్రామాల్లో కొత్త లొల్లి షురూ అయ్యింది.

ఎనిమిదేళ్ళుగా లేని రగడ ఇప్పుడెందుకు తెరపైకొచ్చింది.? సరిగ్గా, ఇదే సందర్భాన్ని వాడుకుని, ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అంతర్భాగమైన భద్రాచలంను తిరిగి రాబట్టుకోవాలన్నది వైసీపీ మీద పెరుగుతున్న డిమాండ్. అయితే, వైసీపీ ఈ విషయంలో గట్టిగా కాదు, ఓ మోస్తరుగా కూడా నినదించడం కష్టమే. ఎందుకంటే, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల, తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టారు.

భద్రాచలం వివాదం ముదిరితే షర్మిలకు రాజకీయ సెగ తెలంగాణలో గట్టిగా తగులుతుంది. ఆమెకోసం ఐదు గ్రామాల్ని ఏపీ నుంచి తెలంగాణలో కలిపేందుకు వైఎస్ జగన్ సిద్ధపడతారా.? లేదంటే, రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, భద్రాచలం ప్రాంతాన్ని ఏపీలో కలిపేలా చేసుకుంటారా.? వేచి చూడాల్సిందే.