గత ఎన్నికల్లో వైసీపీ ఆశలు పెట్టుకుని కోల్పోయిన అసెంబ్లీ స్థానాల్లో పాలకొల్లు కూడ ఒకటి. ఈ స్థానంలో ఎప్పటి నుండో తెలుగుదేశం హవానే నడుస్తోంది. నిమ్మల రామానాయుడు ఇక్కడ పార్టీకి ఎలాంటి ఇడిదుడుకులు లేకుండా నడిపిస్తున్నారు. 2014 ఎన్నికల్లో గెలిచిన ఆయన 2019లో జగన్ సునామీని ఎదుర్కొని నిలబడి మరీ 17 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. ఆ మెజారిటీ చూస్తేనే నిమ్మల బలమేంటో అర్థం చేసుకోవచ్చు. పైగా గత ఎన్నికల్లో ఓడిపోయినా వైసీపీ అభ్యర్థి డాక్టర్ బాబ్జీ అలియాస్ సత్యనారాయణమూర్తి సైలెంట్ అయిపోయారు. నిమ్మల రామానాయుడు లాంటి బలమైన నాయకుడ్ని ఢీకొట్టాలంటే పితాని సత్యనారాయణే సరైన వ్యక్తని, కాస్తంత ప్రోత్సాహం అందిస్తే మిగతాది ఆయనే చూసుకుంటారనేది జగన్ ఆలోచన.
అంతేకాదు నియోజకవర్గంలో బలంగా ఉన్న బీసీల ఓట్లను టార్గెట్‌గా చేసుకుని శెట్టిబలిజ వర్గానికి చెందిన కవురు శ్రీనివాస్‌కు ఇన్‌చార్జ్ పగ్గాలు ఇవ్వడంతో పాటు ఆయనకే డీసీసీబీ చైర్మన్ పదవి ఇచ్చారు. కాపుల్లో బలంగా ఉన్న తూర్పు కాపులను ఆకట్టుకునేందుకు అదే వర్గం నేత యడ్ల తాతాజీకి డీసీఎస్ఎంస్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. త్వరలో జరిగే జడ్పీచైర్మన్ ఎన్నికల్లో అతడే పార్టీ జడ్పీచైర్మన్ అభ్యర్థి అని అంటున్నారు. ఈ రకమైన ఎత్తుగడలతో పంచాయతీ ఎన్నికల్లో నిమ్మలకు గట్టి షాకే ఇచ్చారు. నిమ్మలకు క్షేత్ర స్థాయిలో మంచి క్యాడర్ ఉంది. అదే ఆయన్ను గత ఎన్నికల్లో జగన్ కు ఎదురొడ్డి గెలిచేలా చేసింది. ఇప్పుడు అలాంటి క్యాడర్ మీదనే క్వశ్చన్ మార్క్ పడిపోయింది.
పాలకొల్లులో పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ టీడీపీ మీద స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. ఏకగ్రీవాల్లోనే 16 పంచాయతీలు వైసీపీ వశమయ్యాయి. ఇక ఎన్నికల్లో యలమంచిలి 22 పంచాయతీలు వైసీపీ ఖాతాలో పడగా పాలకొల్లు మండలంలో 16, పోడూరు మండలంలో నియోజకవర్గ పరిధిలో ఉన్న గ్రామాల వరకు 3 పంచాయతీలు వైసీపీ సానుభూతిపరుల వశమయ్యాయి. ఈ గెలుపు అంతా ఏడాది నుండి అమలుచేసిన వ్యూహాల ఫలితమే అనుకోవాలి. మొత్తానికి పంచాయతీ ఎన్నికల్లో వెనుకబడిన నిమ్మల మండల, జడ్పీటీసీ, మునిసిపల్ ఎన్నికల్లో అయినా పట్టు నిలుపుకుంటారో లేదో.