‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరమైన కార్యక్రమాలకు.. అదీ వైసీపీ కార్యక్రమాలకు ఎలాంటి ఆంక్షలూ లేవు. అదే విపక్షాలు చేసే రాజకీయ పరమైన కార్యక్రమాలకు మాత్రం ఆంక్షలున్నాయ్.. హిందూ మతానికి సంబంధించిన కార్యక్రమాలపైనా ఆంక్షలు పెడుతున్నారు..’ అంటూ గత కొంతకాలంగా విపక్షాలు ఆందోళన చేస్తున్న విషయం విదితమే. వైసీపీ ప్రభుత్వం, ఈ విషయంలో విపక్షాలకు ఇంకో ఛాన్స్ ఇచ్చేసింది.. ప్రభుత్వాన్ని విమర్శించేందుకోసం. వినాయక చవితి ఉత్సవాలను బహిరంగంగా, ఘనంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించలేదు. రాష్ట్రంలో కరోనా వైరస్ ఇంకా అదుపులోకి రాకపోవడంతో, ప్రస్తుతానికి జనం గుమికూడే ఎలాంటి ఉత్సవాలకూ అనుమతివ్వలేమని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమల్లో వుంది.
రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలున్నాయి.. ప్రజల కదలికలపైన. వాటిని మరికొంతకాలం పొడిగించక తప్పని పరిస్థితి. ప్రతిరోజూ రాష్ట్రంలో వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండడమే ఇందుకు నిదర్శనం. నిజానికి, జనం గుమికూడకుండా వుండలా.. ప్రజలే బాధ్యత తీసుకోవాలి. కానీ, రాజకీయ పార్టీలు నిర్లజ్జగా రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు, ప్రజలు మాత్రం ఆంక్షల్ని ఎలా స్వాగతిస్తారు.? అదే అసలు సమస్య. అధికార పార్టీ నేతలు చేపట్టే కార్యక్రమాల కోసం పెద్దయెత్తున జన సమీకరణ చేపడుతుండడంపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టిపెట్టి తగిన చర్యలు తీసుకుంటే, ప్రజలకు పోలీసు వ్యవస్థ పట్ల గౌరవం మరింత పెరుగుతుంది. అధికార పార్టీ పట్ల కూడా సానుకూలత పెరుగుతుంది. కాగా, అధికార పార్టీని ‘మతం కోణం’లో విమర్శించడానికి ప్రతిసారీ అత్యుత్సాహం చూపే బీజేపీ, వినాయక చవితి ఉత్సవాలకు ఆంక్షల విషయమై గళం విప్పుతోంది. బీజేపీకి ఇదొక అలవాటైన వ్యవహారంలా మారిపోయింది.