టార్గెట్ అచ్చెన్న ఫిక్స్… గ్యాలరీ ఎక్కించాలంటున్న జగన్!

వైఎస్ జగన్, కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, రోజా… ఇలా కొంతమంది నేతలను ఓడించాలని టీడీపీ ఎంతలా కోరుకుంటుందో… చంద్రబాబు, అచ్చెన్నాయుడు, రామానాయుడు, పయ్యావుల వంటి వారిని కూడా ఈసారి అసెంబ్లీలో గ్యాలరీ ఎక్కించాలని అధికార వైసీపీ కూడా అంతే బలంగా కొరుకుంటుంది. ఈ క్రమంలో… కుప్పం నుంచి మొదలు టెక్కిలి వరకూ జగన్ తన స్కెచ్ లు తానేసుకుంటున్నారు. ఈ సందర్భంగా తాజాగా “టార్గెట్ అచ్చెన్న” ఫిక్స్ చేశారు జగన్!

అవును… శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న జగన్ అచ్చెన్నాయుడి పైకి ప్రత్యర్థిని ప్రకటించారు. ఈసారి ఎలాగైనా టెక్కిలిని వైసీపీ ఖాతాలో వేయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. అచ్చెన్న మీద 2014లో పోటీ చేసి ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్ నే ఇపుడు జగన్ అభ్యర్ధిగా నిర్ణయించారు. జగన్ తో పాటు తాజా పర్యటనలో దువ్వాడ శ్రీనివాస్ ఆయన వెంట ఉన్నారు. జగన్ కి దువ్వాడ అంటే బాగా ఇష్టం అని వైసీపీ నేతలు చెబుతుంటారు. జగన్ తో మంచి సాన్నిహిత్యం ఉన్న నేతల్లో దువ్వాడ కూడా ఒకరని చెబుతుంటారు.

అందులో భాగంగానే… దువ్వాడను రెండేళ్ల క్రితం ఎమ్మెల్సీ చేసి మరీ టెక్కలిలో మొత్తం అధికార పార్టీ తరఫున హవా చలాయించేలా జగన్ చర్యలు తీసుకున్నారు. దువ్వాడ సైతం ఆ దిశగానే ముందుకు సాగుతున్నారు.

ఇక టెక్కిలి నియోజకవర్గం విషయానికొస్తే… సామాజికవర్గం పరంగా బలంగా ఉన్న కాళింగుల కోట టెక్కలి. ఈ నియోజకవర్గంలో అచ్చెన్న కేవలం ఒకే ఒక మండలం అండతో గెలుస్తూ వస్తున్నారు. అదే సంతబొమ్మాళి మండలం. ఇది టీడీపీకి, అచ్చెన్న ఫ్యామిలీకి గట్టి పట్టున్న మండలం. మిగిలిన మండలలలో వైసీపీకి 2019లో మెజారిటీ వచ్చినా… ఎక్కువ ఓట్లు ఉన్న ఈ మండలమే అచ్చెన్నను కాపాడింది. అయితే… టెక్కలి సామాజికవర్గం కాళింగ సామాజికవర్గం చేతిలో ఉండాలని ఆ సామాజికవర్గంలో బలమైన ఆకాంక్ష ఉంది. ఈ క్రమంలో… వెలమ సామాజికవర్గానికి చెందిన అచ్చెన్న రాజకీయాలను ఈసారి తొక్కిపెట్టాలని ఆ వర్గం బలంగా కోరుకుంటుంది. ఇది దువ్వాడకు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు.

దీంతో దువ్వాడ కనుక ఈ విషయంలో కాస్త దృష్టిసారించి… అందరికీ కలుపుకుని పోయే విధంగా వ్యవహరిస్తే అచ్చెన్న మీద గెలవచ్చని అంటున్నారు విశ్లేషకులు. దాని కోసం ఇప్పటికే జగన్ కూడా దిశానిర్దేశం చేశారని చెబుతున్నారు. మరి ఆ దిశగా దువ్వాడ ప్రయత్నం చేస్తారా? రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచిన అచ్చెన్న మీద సహజంగా ఉండే వ్యతిరేకతను సొమ్ము చేసుకుంటారా? సంతబొమ్మాళి మండలాన్ని కూడా సొంతం చేసుకుంటారా? టెక్కలి లో వైసీపీ జెండా ఎగరేస్తారా? ఫలితంగా… అచ్చెన్నను అసెంబ్లీ గ్యాలరీ ఎక్కిస్తారా? అన్నది వేచి చూడాలి!